సుప్రీంకోర్టు తీర్పు తనను ఆపలేదని ట్రంప్ స్పష్టం చేశారు. పాత చట్టం (IEEPA) కింద వేసిన పన్నులను కోర్టు కొట్టివేస్తే, తక్షణమే ‘సెక్షన్ 122’ కింద 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. “నేను ఎంత పన్ను వేయాలనుకుంటే అంత వేస్తాను. పాత చట్టాల కంటే ఇప్పుడు మా దగ్గర ఉన్నవి చాలా శక్తిమంతమైనవి. అవసరమైతే ఏ దేశంపైనైనా వాణిజ్య దిగ్బంధం విధిస్తాను, ఇతర దేశాల వాణిజ్యాన్ని దెబ్బతీసే అధికారం నాకుంది” అంటూ ఆయన తన దూకుడును ప్రదర్శించారు.
సుంకాల విధింపు వల్ల అమెరికాలో పరిశ్రమలు కళకళలాడుతున్నాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. జార్జియాలోని ఒక స్టీల్ ప్లాంట్ యజమాని తనను కలిసి “సార్, మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలని ఉంది” అని అన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. విదేశీ వస్తువుల దిగుమతి ఆగిపోవడంతో అమెరికాలో నిరుద్యోగం తగ్గిందని, స్టాక్ మార్కెట్ (Dow Jones) 50 వేల మార్కును దాటిందని ఆయన గర్వంగా ప్రకటించారు.
సుప్రీంకోర్టు తీర్పుతో గతంలో వసూలు చేసిన సుమారు 175 బిలియన్ డాలర్ల పన్ను ఆదాయం ఇప్పుడు అనిశ్చితిలో పడింది. ఆ డబ్బును వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందా? అన్న ప్రశ్నకు.. “కోర్టు ఆ విషయం గురించి చర్చించలేదు, దీనిపై మరో ఐదేళ్ల పాటు కోర్టులో పోరాటం సాగుతుంది” అని ట్రంప్ దాటవేశారు.
