Site icon HashtagU Telugu

Sunita Williams : సునితా విలియమ్స్‌ను భూమికి తీసుకురండి.. ట్రంప్ ఆదేశం.. మస్క్‌ ప్రకటన

Sunita Williams Donald Trump Elon Musk Spacex

Sunita Williams : సునితా విలియమ్స్..  ప్రముఖ భారత సంతతి వ్యోమగామి. ఈమె గత 237 రోజులుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోనే ఉన్నారు. ఈ వ్యవధిలో ఎటూ కదలక.. ఆమె నడవడం కూడా మర్చిపోయారట. బోయింగ్‌ ‘స్టార్‌లైనర్‌’ వ్యోమనౌకలో  2024 సంవత్సరం జూన్‌ 5న సునితా విలియమ్స్, బచ్ విల్మోర్‌తో కలిసి 8 రోజుల మిషన్ కోసం బయలుదేరారు. అయితే ‘స్టార్‌లైనర్‌’ వ్యోమనౌకలో  సాంకేతిక లోపాలు తలెత్తడంతో దానిలో భూమికి తిరిగి రాలేక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆమెను భూమికి తీసుకొచ్చే ప్రక్రియను నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేగవంతం చేశారు. ఆ బాధ్యతను తన ప్రభుత్వంలోని గవర్నమెంట్ ఎఫీషియెన్సీ విభాగం ‘డోజ్’ సారథి, అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అప్పగించారు. దీంతో తనకు చెందిన ‘స్పేస్‌ఎక్స్‌’ కంపెనీ ద్వారా మస్క్ కసరత్తును ప్రారంభించినట్లు తెలిసింది. ఈ సంవత్సరం మార్చి నెలాఖరుకల్లా సునితా విలియమ్స్‌ను భూమికి తీసుకొచ్చే దిశగా మస్క్ ప్రణాళిక రెడీ చేస్తున్నారని సమాచారం.

Also Read :Medigadda Flaws Exposed : మేడిగడ్డ లోపాల పుట్ట.. ఐఐటీ రూర్కీ అధ్యయనంలో వెల్లడి

ఎలాన్ మస్క్ ప్రకటన ఇదీ.. 

గత బైడెన్ ప్రభుత్వం అలసత్వం వల్లే ఇప్పటివరకు సునితా విలియమ్స్(Sunita Williams) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండిపోవాల్సి వచ్చిందని ఎలాన్ మస్క్ మండిపడ్డారు.  ట్రంప్ హయాంలో అలా జరగదని, ఆయన ప్రతీ విషయాన్ని స్వయంగా పరిశీలించి సత్వర నిర్ణయం తీసుకుంటారని మస్క్ చెప్పుకొచ్చారు.  అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను(సునితా విలియమ్స్, బచ్ విల్మోర్)  వీలైనంత త్వరగా భూమికి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయం నుంచి తమ కంపెనీ స్పేస్ ఎక్స్‌కు వినతి అందిందని ఆయన వెల్లడించారు. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటివారం కల్లా వారిద్దరిని భూమికి తీసుకొస్తామని మస్క్ ప్రకటించారు.

Also Read :Caste Survey : కులగణన సర్వే తుది నివేదిక.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

వ్యోమగాముల వయసుపై డిబేట్

గత 237 రోజులుగా అంతరిక్షంలో ఉన్న సునితా విలియమ్స్ వయసు 59 ఏళ్లు. బచ్ విల్మోర్ వయసు 61 ఏళ్లు. వీళ్లిద్దరు ఇంత వయసులో ఇన్ని రోజుల పాటు అంతరిక్ష వాతావరణంలో ఉండటం ఎంతవరకు సేఫ్ ? ఇంత వయసు వారిని వ్యోమగాములుగా కంటిన్యూ చేయడం అవసరమా ? అనే కోణంలో నెటిజన్ల మధ్య వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ విధంగా అంతరిక్షంలో ఇరుక్కునే పరిస్థితులు వస్తే.. ఎక్కువ వయసున్న వారికి ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యపరమైన సమస్యలు, ఇతరత్రా బలహీనతలు వచ్చే ముప్పు పెరుగుతుంటుంది. అందుకే వ్యోమగాముల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది.