Cyclone Chido : ఫ్రాన్స్‌లోని పలు ప్రాంతాలను చిడో తుఫాను వణికిస్తోంది. ఈ తుఫాను వల్ల సంభవించిన వేర్వేరు ఘటనల్లో వేలాది మంది చనిపోయినట్లు తెలుస్తోంది. హిందూ మహాసముద్రంలో ఫ్రాన్స్ దేశానికి మయోట్ అనే ద్వీపకల్పం ఉంది. దీనిపై చిడో తుఫాను ప్రభావం ఎక్కువగా పడింది. ఇక్కడే భారీ సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. వేలాది మంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి తుఫాను తీవ్రత ఒక్కసారిగా పెరిగిందని తెలిసింది. దీనివల్ల మయోట్‌లోని సముద్ర తీరంలో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల ధాటికి ఎన్నో ఇళ్లు కూలిపోయాయి. దీంతో జనం గుడారాలు వేసుకొని బిక్కుబిక్కుమంటూ వాటిలో కాలం గడుపుతున్నారు. గత 100 ఏళ్లలో ఇంత బలమైన తుఫాను ఎన్నడూ మయోట్ ద్వీపకల్పాన్ని తాకలేదని వాతావరణ నిపుణులు అంటున్నారు.
Also Read :Assad 2100 Crores : వామ్మో.. సిరియా నుంచి అసద్ అంత డబ్బు తీసుకెళ్లాడా ?
‘‘ఈ తుఫాను వల్ల మయోట్ అతలాకుతలం అయింది. ఈ తుఫాను(Cyclone Chido) వల్ల అణుబాంబులు వేసినంత ఎఫెక్టు మా ప్రాంతంపై పడింది’’ అని మయోట్ ప్రాంత రాజధాని నగరం మమౌద్జౌకు చెందిన పలువురు స్థానికులు తెలిపారు. తుఫాను ధాటికి నగరంలోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయాయని చెప్పారు. తుఫాను వల్ల కలిగిన విషాదంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. సహాయక చర్యలను వేగవంతం చేస్తామన్నారు.
Also Read :Rajkapoor Songs : రాజ్‌కపూర్ శత జయంతి.. 30 గంటల్లో 450 పాటలు.. ‘గోల్డెన్ బుక్’ రికార్డ్
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరం నుంచి దాదాపు 8వేల కి.మీ దూరంలో మయోట్ ప్రాంతం ఉంది. ఫ్రాన్స్‌లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే మయోట్ ప్రాంతంలోని ప్రజలు చాలా పేదవారు. ఇక్కడ నిత్యం మాఫియా ముఠాలు హింసాకాండకు పాల్పడుతుంటాయి. స్థానికంగా లా అండ్ ఆర్డర్ పెద్దగా కంట్రోల్‌లో ఉండదు. ఈ ఏడాది ప్రారంభంలో మయోట్ ప్రాంత ప్రజలు తాగునీటి కొరతతో అల్లాడిపోయారు.