Shock To Russia : ఉక్రెయిన్‌తో గత రెండున్నర ఏళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యాలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. రష్యా రాజధాని మాస్కోలో ఏకంగా ఆ దేశ న్యూక్లియర్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిర్లోవ్‌పై భీకర బాంబుదాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన చనిపోయారు. మాస్కో మహా నగరం పరిధిలోని రిజియాన్స్‌కీ ప్రాస్పొక్టెలో ఉన్న ఓ భవనంలో లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిర్లోవ్ నివసిస్తుంటారు. ఆ భవనం బయట పార్క్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అమర్చిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలాయి. ఈ పేలుడు ధాటికి భవనంలో ఉన్న ఇగోర్‌తో పాటు ఆయన అసిస్టెంట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈవివరాలను రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. ఈ పేలుడు సంభవించిన రిజియాన్స్‌కీ ప్రాస్పొక్టె(Shock To Russia) అనేది.. రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌కు కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
Also Read :Google Vs ChatGPT : ‘గూగుల్ సెర్చ్’తో ‘ఛాట్ జీపీటీ సెర్చ్’ ఢీ.. సరికొత్త ఫీచర్లు ఇవీ
ఉక్రెయిన్‌కు చెందిన ఒక ప్రముఖ వార్తాపత్రికలో 24 గంటల క్రితమే ఒక సంచలన కథనం పబ్లిష్ అయింది. ఆ కథనంలో రష్యాకు చెందిన న్యూక్లియర్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిర్లోవ్ గురించి ప్రధానంగా ప్రస్తావించారు. నిషేధిత రసాయన ఆయుధాలను ఉక్రెయిన్‌పైకి ప్రయోగించాలని రష్యా సైన్యానికి ఇగోర్ కిర్లోవ్ ఆదేశాలు జారీ చేశారని ఆ కథనంలో ఆరోపించారు. ఈ వార్త పబ్లిష్ అయిన 24 గంటల్లోనే.. మాస్కో నగరంలోని ఇగోర్ కిర్లోవ్ ఇంటిపై బాంబు దాడి జరగడం, ఆయన చనిపోవడం సందేహాలకు తావిస్తోంది. ముందస్తు ప్లాన్ ప్రకారమే ఆయననను హత్య చేసి ఉంటారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ హత్యలో అమెరికా, బ్రిటన్ నిఘా సంస్థల పాత్ర ఉందా ? అనే కోణంలో రష్యా ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. రష్యాలో జీవ రసాయన ఆయుధాల రక్షణ అనేది లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిర్లోవ్ ఆధీనంలోనే ఉండేది. ఇంతటి కీలక పాత్రను పోషిస్తున్న ఇగోర్ కిర్లోవ్ హత్య అనేది ఇప్పుడు రష్యాలో సంచలన అంశంగా మారింది. అక్కడి మీడియాలో ప్రస్తుతం దీనిపైనే చర్చ నడుస్తోంది. రాజధాని మాస్కోలోని ప్రధాన వ్యక్తులకూ ఇంతటి ముప్పు పొంచి ఉండటం.. అక్కడి సామాన్య ప్రజానీకానికి ఆందోళన రేకెత్తిస్తోంది.