Site icon HashtagU Telugu

Canada: కెన‌డా పార్ల‌మెంట్‌కు తాళాలు.. ఎందుకో తెలుసా..? అక్క‌డ అస‌లేం జ‌రుగుతుందంటే?

Canadian Parliament

Canadian Parliament

Canada: కెన‌డాలో అక్టోబ‌ర్ 27న జ‌ర‌గాల్సిన ఎన్నిక‌ల‌ను ఆరు నెల‌ల‌కు ముందుగానే నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఏప్రిల్ 28న ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో కెన‌డా ప్ర‌ధాన మంత్రి మార్క్ కార్నీ పార్ల‌మెంట్ ను ర‌ద్దు చేశారు. అయితే, ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తున్న వేళ పార్ల‌మెంట్ భ‌వ‌నంలోకి దుండ‌గుడు ప్ర‌వేశించ‌డం క‌ల‌క‌లం రేపింది. దేశానికి సంబంధించిన సున్నిత‌మైన స‌మాచారాన్ని అప‌హ‌రించ‌డానికి దుండ‌గుడు య‌త్నించి ఉంటాడా అనే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Also Read: CM Chandrababu: యూఎస్ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌ర‌పండి.. కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు చంద్ర‌బాబు లేఖ‌

ఒట్టావాలోని కెనడియన్ పార్లమెంట్ భ‌వ‌నంలోకి శ‌నివారం గుర్తు తెలియ‌ని దుండ‌గుడు ప్ర‌వేశించాడు. అక్ర‌మంగా పార్ల‌మెంట్ హిల్ లోని తూర్పు బ్లాక్ లోకి చొర‌బ‌డ్డాడు. ఈ విష‌యం తెలుసుకున్న అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. భ‌వ‌నం చుట్టూ పోలీసుల‌ను మోహ‌రించారు. తూర్పు బ్లాక్ లో ఉన్న సిబ్బందిని మొత్తం ఒక‌ గ‌దిలోకి చేరుకొని తాళాలు వేసుకోవాల‌ని సూచించారు. భ‌వ‌నంలోని ప‌లు ప్ర‌దేశాల‌పై లాక్ డౌన్ విధించారు. పార్ల‌మెంట్ కు స‌మీపంలోని రోడ్ల‌న్నీ మూసివేస్తున్నామ‌ని, ప్ర‌జ‌లెవ‌రూ అటువైపు రావొద్ద‌ని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాత్రంతా దుండగుడు పార్ల‌మెంట్ భ‌వ‌నంలోనే ఉన్నాడు. అయితే, ఆదివారం ఉద‌యం దుండ‌గుడిని అరెస్టు చేసిన‌ట్లు ఒట్టావా పోలీసులు తెలిపారు. దుండగుడు పార్ల‌మెంట్ భ‌వ‌నంలోకి ప్ర‌వేశించ‌డానికి కార‌ణం ఏమిట‌నే విష‌యంపై ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Also Read: PM Modi: డీఎంకే ప్ర‌భుత్వంపై ప్ర‌ధాని మోదీ ప‌రోక్ష విమ‌ర్శ‌లు.. సంత‌క‌మైనా త‌మిళంలో చేయండంటూ..

ఒట్టావాలోని పార్లమెంట్ హౌస్‌లో జరిగిన ఈ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అందుకే ఈ మొత్తం విషయాన్ని దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాలను నియమించారు. ప్రస్తుతం, పార్లమెంట్ హౌస్, పరిసర ప్రాంతాలలో పోలీసులు లాక్ డౌన్‌ విధించారు. ఇక్కడికి ఎవరూ వెళ్ళడానికి అనుమతి లేదు. ఎందుకంటే పోలీసులు ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆ యువకుడు ప్రవేశించిన ప్రాంతం ఈస్ట్ బ్లాక్. సెనేటర్లు, వారి సిబ్బంది కార్యాలయాలను కలిగి ఉంది.