Site icon HashtagU Telugu

BRICS Vs US Dollar : అమెరికా డాలర్ వర్సెస్ బ్రిక్స్ కరెన్సీ.. పుతిన్ కీలక ప్రకటన

Brics Vs Us Dollar Multi Currency System

BRICS Vs US Dollar : అమెరికా డాలరుపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రత్యామ్నాయ మార్గాలపై 10 దేశాలతో కూడిన ‘బ్రిక్స్’ కూటమి ఫోకస్ పెట్టింది. ఈనెల 22న రష్యాలోని తటారిస్థాన్‌ నగరం వేదికగా జరగబోతున్న బ్రిక్స్ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సులో ఈ అంశంపై ప్రధానంగా చర్చిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వెల్లడించారు. బ్రిక్స్ దేశాల ప్రముఖ మీడియా సంస్థల సీనియర్‌ సంపాదకుల టీమ్‌తో ఆయన తన నివాసంలో ముచ్చటిస్తూ ఈవివరాలను తెలియజేశారు. బ్రిక్స్‌ దేశాల వినియోగం కోసం ఉమ్మడి కరెన్సీని వెంటనే తీసుకురావడం అనేది  సాధ్యమయ్యే విషయం కాదని ఆయన స్పష్టం చేశారు. కాస్త ఆలస్యంగానైనా ఉమ్మడి కరెన్సీని ఏర్పాటు చేసుకోకుంటే.. బ్రిక్స్ దేశాలకు చాలా సవాళ్లు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read :Kappatralla Forest : ‘యురేనియం’ రేడియేషన్ భయాలు.. కప్పట్రాళ్లలో కలవరం

ఉమ్మడి కరెన్సీని తీసుకొచ్చేందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోందని పుతిన్ తెలిపారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా తమ కూటమిలోని దేశాలన్నీ పరస్పరం డిజిటల్‌ కరెన్సీ వాడుకునేలా ప్రోత్సహించే దిశగా కసరత్తు జరుగుతోందని ఆయన చెప్పారు. పెట్టుబడుల ప్రాజెక్టుల కోసం నిధులను డిజిటల్ కరెన్సీ రూపంలో సమీకరించే ప్రతిపాదనపై త్వరలో చర్చిస్తామన్నారు.  కరెన్సీ సమస్యను అధిగమించేందుకు ఎలక్ట్రానిక్‌ సాధనాలను వాడుతామన్నారు. ఈక్రమంలో బ్రిక్స్ దేశాలకు(BRICS Vs US Dollar) చెందిన సెంట్రల్‌ బ్యాంకుల మధ్య సంబంధాలు బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా మిత్రదేశాలు కూడా డాలర్‌ నిల్వల్ని తగ్గించుకుంటున్నాయని పుతిన్ తెలిపారు. డాలరును వాడాలంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు భయపడుతున్నాయన్నారు.  అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షల నుంచి రక్షణ పొందేందుకు ‘స్విఫ్ట్‌’ తరహా అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంపై ఫోకస్ చేస్తామని రష్యా అధ్యక్షుడు వెల్లడించారు.

Also Read :Health Tips : రాత్రి పడుకునే ముందు బాగానే ఉన్నా.. ఉదయం నిద్రలేచిన వెంటనే తలనొప్పి వస్తే కారణాలు ఇవే..!

‘‘ఇండియా సినిమాలు అంటే మా రష్యన్లకు చాలా ఇష్టం. 24 గంటలు ఇండియన్ ఫిల్మ్స్ ప్రసారమయ్యే ప్రత్యేక టీవీ ఛానల్‌ కూడా మా దేశంలో ఉంది. ఇండియన్ ఫిల్మ్స్‌ను రష్యాలో ప్రదర్శించడానికి మేం రెడీ. దీనికి ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తాం. ఫార్మా రంగానికి కూడా మా దేశం చాలా అనుకూలం. వీటిపై భారత ప్రధాని మోడీతో చర్చిస్తాను. భవిష్యత్తులో బ్రిక్స్‌ కూటమి దేశాలతో సంగీత ఉత్సవాలు కూడా ఏర్పాటు చేస్తాం’’ అని పుతిన్ ప్రకటించారు.