Bangladesh – India Border : షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి వచ్చేశాక అక్కడి పరిస్థితులు మారాయి. గతంలో హసీనాకు సన్నిహితంగా ఉన్న రాజకీయ, ప్రభుత్వ, న్యాయ రంగాల వారిపై వేధింపులు జరుగుతున్నాయి. ఈ వేధింపులను తాళలేక చాలామంది బంగ్లాదేశ్ వదిలి పారిపోయేందుకు యత్నిస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఒకరు బంగ్లాదేశ్ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించారు. అయితే సిల్హెట్ ఏరియాలోని కనై ఘాట్ మీదుగా సరిహద్దు దాటుతుండగా ఆయనను బంగ్లాదేశ్ సైనికులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ రిటైర్డ్ జడ్జీ పేరు షంషుద్దీన్ చౌదరి మాణిక్. గతంలో సుప్రీంకోర్టు అప్పిలేట్ డివిజన్ జడ్జిగా(Bangladesh – India Border) వ్యవహరించారు.
We’re now on WhatsApp. Click to Join
షేక్ హసీనా ఆగస్టు 5న బంగ్లాదేశ్ వదిలి భారత్‌కు వచ్చేశారు. జులై నుంచి ఆగస్టు మొదటి వారం వరకు దేశంలో విద్యార్థి సంఘాల నిరసనలను కట్టడి చేసేందుకు షేక్ హసీనా ప్రభుత్వం ప్రయత్నించింది. ఈక్రమంలో పోలీసులు, భద్రతా బలగాలు, షేక్ హసీనా రాజకీయ పార్టీ నాయకులు జరిపిన దాడుల్లో దాదాపు 500 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిరసన పతాక స్థాయికి చేరింది. అందువల్లే తనపై తిరుగుబాటు అనివార్యమని భావించిన షేక్ హసీనా దేశం వదిలి భారత్‌కు వచ్చారు. ఈ పరిణామం తర్వాత బంగ్లాదేశ్ ఆర్మీ, దేశాధ్యక్షుడు కూడా స్వరం మార్చుకున్నారు. షేక్ హసీనా రాజకీయ విరోధి బేగం ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేశారు.
Also Read :Nagarjuna : షాకిచ్చిన హైడ్రా.. హీరో నాగార్జున ‘ఎన్ కన్వెన్షన్’ కూల్చివేత
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామాను కోరుతూ విద్యార్థి సంఘాలు జరిపిన నిరసనలకు స్వయంగా బంగ్లాదేశ్ ఆర్మీ మద్దతు పలికింది. ఆ వెంటనే వందలాది మంది షేక్ హసీనా సన్నిహితుల ఇళ్లపై దాడులు జరిగాయి. ఈక్రమంలోనే బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ ఆగస్టు 8న ప్రమాణ స్వీకారం చేశారు. త్వరలోనే బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో షేక్ హసీనా రాజకీయ పార్టీ అవామీ లీగ్‌కు పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తారా ? లేదా ? అనేది వేచిచూడాలి.