AR Rahman : వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. తాజాగా మన దేశానికి చెందిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కమలకు మద్దతు ప్రకటించారు. అమెరికా ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలకు సంఘీభావం తెలుపుతూ ఒక గీతాన్ని స్వయంగా రెహమాన్ (AR Rahman) స్వరపరిచారు. ఈ మ్యూజిక్ వీడియో క్లిప్ నిడివి 30 నిమిషాలు. దీనివల్ల భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి మరింత మద్దతు పెరుగుతుందని ఆశిస్తున్నారు. దక్షిణాసియా ప్రాంతం నుంచి కమలా హ్యారిస్‌కు మద్దతుగా సంగీత సందేశాన్ని పంపిన తొలి కళాకారుడిగా ఏఆర్ రెహమాన్ నిలిచారు. నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ తరుణంలో ఏఆర్ రెహమాన్ విడుదల చేసిన మ్యూజిక్ క్లిప్.. కమలకు పాజిటివ్‌గా మారుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల అమెరికాలోని భారత, దక్షిణాసియా దేశాల ఓటర్లు కమలకు అనుకూలంగా మారుతారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ కంటే కమల ముందంజలో ఉన్నారు. ఇప్పుడు ఏఆర్ రహమాన్ సంగీత మాయజాలంతో కమల మరింత ముందడుగు వేసే అవకాశం ఉంది.
Also Read :US Vs Iran : ఇరాన్ ఆయుధాల నౌక వర్సెస్ అమెరికా.. నేవీ సీల్స్ మరణంపై కొత్త అప్‌డేట్
కమలకు మద్దతుగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ క్లిప్‌పై ఆసియన్-అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ (AAPI) విక్టరీ ఫండ్ చైర్‌పర్సన్, శేఖర్ నరసింహన్ స్పందించారు. ఈ మ్యూజిక్ క్లిప్‌ను చూస్తే అమెరికాలోని ఆసియా దేశాల ఓటర్లకు సరైన మార్గం కనిపిస్తుందని తెలిపారు. అమెరికా భవిష్యత్తును నిర్మించగల నాయకురాలు కమలను అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలన్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వీడియో క్లిప్‌ను AAPI విక్టరీ ఫండ్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్‌లో రేపు (అక్టోబర్ 13న) రాత్రి 8 గంటలకు ప్రసారం చేస్తామని వెల్లడించారు.