Kash Patel Vs Elon Musk : అమెరికాలో కొత్తగా ఏర్పడిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఏదో జరుగుతోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) విభాగం సారథి ఎలాన్ మస్క్ ఇస్తున్న ఆదేశాలను పాటించేందుకు వివిధ మంత్రిత్వ శాఖలు నో చెబుతున్నాయి. ఈవిషయంలో ముందు వరుసలో నిలిచింది మరెవరో కాదు. భారత సంతతికి చెందిన కాష్ పటేల్. అమెరికా దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా ఉన్న కాష్ పటేల్ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read :SLBC Tunnel: ఏమిటీ ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ? 20 ఏళ్లుగా ఎందుకు నిర్మిస్తున్నారు ?
కాష్ పటేల్ స్పందన ఇదీ..
‘‘ఎలాన్ మస్క్ పంపిన ఈ-మెయిల్‌ను ఎవరూ పట్టించుకోవద్దు’’ అని ఎఫ్‌బీఐ పరిధిలోని ఉద్యోగులకు కాష్(Kash Patel Vs Elon Musk) సూచించారు. ‘‘అమెరికా ప్రభుత్వ ఉద్యోగులంతా గతవారం ఏం పని చేశారో చెప్పాలి. లేదంటే రాజీనామా చేయాలి’’ అంటూ ఇటీవలే డోజ్ విభాగం నుంచి ఉద్యోగులందరికీ ఎలాన్ మస్క్ ఈమెయిల్ పంపారు. దీనిపైనే కాష్ పటేల్ పెదవి విరిచారు. ‘‘అమెరికా ప్రభుత్వ సిబ్బంది మంత్రిత్వ శాఖ (OPM) నుంచి ఎఫ్‌బీఐ సిబ్బందికి ఈ-మెయిల్ వచ్చి ఉండొచ్చు. సంస్థ ఉద్యోగుల సమీక్ష ప్రక్రియకు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కార్యాలయం మాత్రమే బాధ్యత వహిస్తుంది. ఎఫ్‌బీఐ విధానాలకు అనుగుణంగా సమీక్షలు ఉంటాయి. మరిన్ని వివరాలు అవసరమైతే మిమ్మల్ని మేం సమన్వయం చేసుకుంటాం. ప్రస్తుతానికి దయచేసి ఏవైనా మెయిల్స్‌కు స్పందించొద్దు’’ అని కాష్ పటేల్ ఎఫ్‌బీఐ ఉద్యోగులకు ఈమెయిల్ పంపారు.
Also Read :Driving License : ఇంట్లో నుంచే డ్రైవింగ్ లైసెన్స్.. షోరూం నుంచే వాహన రిజిస్ట్రేషన్
ఉద్యోగ సంఘాల.. సై
ఎలాన్ మస్క్‌కు చెందిన ‘డోజ్’ విభాగం పంపిన ఈమెయిల్‌పై ఎఫ్‌బీఐ మాదిరిగానే ఇతరత్రా అమెరికా ప్రభుత్వ విభాగాలు కూడా రియాక్ట్ అయ్యాయి. దానికి స్పందించాల్సిన అవసరం లేదని తమ సిబ్బందికి సూచించారు. అమెరికాలోనే అతి పెద్ద ఉద్యోగ సంఘం అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ (AFGE) నేషనల్ ప్రెసిడెంట్ ఎవెరెట్ కెల్లీ కూడా డోజ్ విభాగం చేష్టలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ సర్కారు చర్యలు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల, దేశ ప్రజలకు అందించే సేవల పట్ల ఆయనకు ఉన్న అయిష్టతను సూచిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేస్తే న్యాయపరంగా సవాల్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. డోజ్ విభాగం పంపిన ఈమెయిల్‌కు సమాధానం ఇవ్వరాదని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయి.
ఎలాన్ మస్క్ ఏం చేయబోతున్నారు ?
తన ఈమెయిల్‌పై దుమారం రేగడంతో ఎలాన్ మస్క్ మరో ట్వీట్ చేశారు. ‘‘అర్ధమయ్యేలా కొన్ని బుల్లెట్ పాయింట్లతో కూడిన మెయిల్ పంపినా చాలు’’ అని అమెరికా ప్రభుత్వ ఉద్యోగులకు సూచించారు. మొత్తం మీద డోజ్ విభాగం భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. ఇదే విధంగా వివిధ మంత్రిత్వ శాఖల నుంచి వ్యతిరేకత ఎదురైతే డోజ్ బాధ్యతల నుంచి ఎలాన్ మస్క్ వైదొలగినా ఆశ్చర్యపోనక్కర లేదు.