40000 Resignations : ప్రస్తుతం అమెరికాలోని ప్రతీ రంగంపై నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ఇటీవలే ట్రంప్ ‘బై ఔట్ ఆఫర్’ను ప్రకటించారు. 8 నెలల శాలరీని ఒకేసారి తీసుకొని, జాబ్స్‌కు రాజీనామా చేయాలని ఆయన ప్రభుత్వ ఉద్యోగులను పిలుపునిచ్చారు. అమెరికాలోని దాదాపు 23 లక్షల మంది సర్కారీ ఉద్యోగులు బై ఔట్ ఆఫర్‌కు అర్హులు. అయితే ఇప్పటివరకు దాదాపు 40వేల మంది రాజీనామా లెటర్లు(40000 Resignations) ఇచ్చి, బై ఔట్ ఆఫర్‌కు ఓకే చెప్పారు. రాజీనామా చేసిన వారిలో అమెరికా ప్రభుత్వానికి చెందిన ఆర్మీ సిబ్బంది, తపాలా సిబ్బంది, ఇమిగ్రేషన్ అధికారులు, భద్రతా బలగాల సిబ్బంది, పోలీసు సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు.
Also Read :Trump Vs Panama : పనామా కాల్వపై నెగ్గిన ట్రంప్ పంతం.. అమెరికా నౌకలకు ఫ్రీ జర్నీ
ఏటా 100 బిలియన్ డాలర్ల ఆదా కోసం..
ఈ ఆఫర్‌ను స్వీకరించేందుకు అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన గడువు ఈరోజు(గురువారం)తో ముగుస్తోంది. దీంతో తదుపరిగా ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? రాజీనామా చేయని ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కనీసం 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు బై ఔట్ ఆఫర్ తీసుకొని రాజీనామా చేస్తారని ట్రంప్ ప్రభుత్వం అంచనా వేసింది. దీనివల్ల అమెరికా ప్రభుత్వానికి ఏటా 100 బిలియన్ డాలర్ల దాకా ఖర్చు తగ్గుతుందని భావించింది. అయితే అంతకంటే చాలా తక్కువ సంఖ్యలో(40వేల మంది) ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేశారు.
Also Read :Bhakta Prahlada : ‘భక్త ప్రహ్లాద’కు 93 ఏళ్లు.. రూ.18వేల బడ్జెట్‌తో తీసిన మూవీ విశేషాలివీ
వాట్స్ నెక్ట్స్ ?
దీంతో ‘బై ఔట్ ఆఫర్’ను తీసుకునేందుకు ఉద్యోగులకు ఇచ్చిన గడువును పొడిగించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రెండోసారి ఇవ్వనున్న గడువులోగా రాజీనామాలు చేయని ఉద్యోగులపై చర్యలకు ట్రంప్ సర్కారు సిద్ధమయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాంటి వారికి ప్రభుత్వమే బై ఔట్ ఆఫర్‌ను నిర్బంధంగా వర్తింపజేసి, నేరుగా ఉద్యోగం తప్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఇలా చేస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తే ముప్పు ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.