Lebanon Explosions : మొన్న పేజర్లు పేలాయి.. నిన్న వాకీటాకీలు పేలాయి.. దీంతో ఏ పరికరం ఎప్పుడు పేలుతుందో అర్థం కాక లెబనాన్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేకించి హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూపును టార్గెట్‌గా చేసుకొని ఈ దాడులు జరుగుతున్నాయి. ఇవి ఇజ్రాయెల్ పనే అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బుల్లా(Lebanon Explosions) వార్నింగ్స్ ఇస్తోంది.
Also Read :Brain Health: మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటున్నారా..?
లెబనాన్‌లో జరిగిన వాకీటాకీ, పేజర్ పేలుడు ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య 32కు పెరిగింది. 3,250 మంది గాయాలయ్యాయి. వారంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పేజర్లు పేలిన ఘటనలో 12 మంది, వాకీటాకీలు పేలిన ఘటనలో 20 మంది చనిపోయారు. ఇక పేజర్లు పేలిన ఘటనలో 2800 మంది గాయపడగా, వాకీటాకీలు పేలిన ఘటనలో 450 మంది గాయపడ్డారు.ఇజ్రాయెలే ఈ దాడుల వెనుక ఉందని లెబనాన్ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈనేపథ్యంలో లెబనాన్ సరిహద్దుల్లోని ఇజ్రాయెల్ ఆర్మీ పాయింట్లు, ఆయుధ స్థావరాలపై హిజ్బుల్లా రాకెట్లతో దాడి చేసింది. దీంతో ఇరుదేశాల బార్డర్‌లో ఉద్రిక్తత నెలకొంది. హిజ్బుల్లా మిలిటెంట్లు కొన్న వేలాది పేజర్లు, వాకీటాకీలలోకి పేలుడు పదార్థాలు ఎలా చేరాయి ? అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది.
Also Read :Tongue Color: ఆసుపత్రికి వెళ్తే వైద్యులు ముందుగా నాలుకనే ఎందుకు చూస్తారో తెలుసా?
ఇజ్రాయెల్ నిఘా నుంచి తప్పించుకోవడానికే పేజర్లు, వాకీటాకీలను హిజ్బుల్లా వాడుతోంది. వాటి గురించి కూడా ఇజ్రాయెల్ ఎలా తెలుసుకోగలిగింది అనేది తెలియాల్సి ఉంది. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ హెజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని జరిగిన పేజర్ పేలుళ్లను ఖండించారు. దీనివల్ల ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య సఖ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక లెబనాన్ పేలుళ్ల ఘటనపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శుక్రవారం రోజు సమావేశం కానుంది. గతేడాది అక్టోబరు 7 నుంచి గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా దాడులు చేస్తోంది.