Motorcycle Sized Tuna : ట్యూనా చేపల సైజు పెద్దగా ఉంటుందని అందరికీ తెలుసు. అయితే తాజాగా జపాన్‌లో దొరికిన ఒక ట్యూనా చేప సైజు, బరువు ఏకంగా మోటార్ సైకిల్ అంతటి రేంజులో ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా జపాన్ రాజధాని టోక్యో నగరంలో ఉన్న టొయొసు ఫిష్ మార్కెట్‌లో ఈ బాహుబలి ట్యూనా చేపలను వేలం వేశారు. ఈ భారీ ట్యూనా చేపను టోక్యోలోని సుశీ రెస్టారెంట్ నిర్వాహకులు రూ.11 కోట్లకు వేలంలో దక్కించుకున్నారు. ఇప్పటివరకు జపాన్‌లో ట్యూనా చేపలకు దక్కిన రెండో అత్యధిక రేటు ఇదే. ఇక ఈ ట్యూనాను తూకం వేయగా.. దాని బరువు 276 కేజీలు ఉందని తేలింది. జపాన్ వ్యాప్తంగా ఉన్న సుశీ రెస్టారెంట్లలో దీని మాంసంతో కూడిన వంటకాలను తయారు చేసి విక్రయించనున్నారు.
Also Read :Viyona Fintech : హైదరాబాదీ కంపెనీ జోష్.. ‘వియోనా పే’, ‘గ్రామ్ పే’ విడుదల
‘‘మా జపాన్‌లో ట్యూనా చేపలను(Motorcycle Sized Tuna) శుభసూచకంగా పరిగణిస్తాం. దాన్ని తినడాన్ని కూడా పవిత్ర కార్యంగా పరిగణిస్తారు. అందుకే మేం అంత రేటు పెట్టి దాన్ని కొన్నాం’’ అని సుశీ రెస్టారెంట్ల కంపెనీ అధికారి షింజి నగావు తెలిపారు. ఉత్తర జపాన్‌లోని ఓమోరీ ప్రాంతంలో ఈ భార ట్యూనా చేప మత్స్యకారులకు దొరికిందన్నారు. గత ఐదేళ్లుగా అరుదైన ట్యూనా చేపలను భారీ ధరలు పెట్టి మరీ తాము వేలంపాటల్లో కొంటున్నామని షింజి నగావు చెప్పారు. గత సంవత్సరం ఒక భారీ ట్యూనా చేపను వేలంలో కొనేందుకు తాము రూ.6 కోట్లకుపైనే వెచ్చించామన్నారు.
Also Read :CM Atishi : ఏడ్చేసిన ఢిల్లీ సీఎం అతిషి.. బీజేపీ నేత రమేశ్ బిధూరి వ్యాఖ్యల ఎఫెక్ట్
టోక్యోలో ఉన్న టొయొసు చేపల మార్కెట్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద చేపల మార్కెట్‌గా పేరుండేది. ప్రతిరోజూ సూర్యాస్తమయం వేళలో అక్కడ చేపల వేలంపాట జోరుగా జరుగుతుంటుంది. ఎంతోమంది పోటీపడి చేపలను కొనేస్తుంటారు. హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపారులు చేపలను వేలంలో దక్కించుకునేందుకు పోటీ పడతారు. ప్రపంచంలో అత్యధికంగా చేపల వంటకాలు తినే దేశాల్లో జపాన్ టాప్ ప్లేసులో ఉంది. జపాన్ ప్రజల ఆయుర్దాయం ప్రపంచంలోనే ఎక్కువగా ఉండటానికి కారణం.. చేప మాంసమే అనే ప్రచారం కూడా ఉంది. అయితే ఈ వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.