పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఐటీ నిపుణులు డెలాయిట్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అభ్యర్థికి కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా ఆఫర్ రద్దు చేయడం 'బిగ్ 4' ప్రమాణాలకు విరుద్ధమని కొందరు మండిపడుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Software Engineer

Software Engineer

Software Engineer: సాఫ్ట్‌వేర్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘బిగ్ 4’ కంపెనీల్లో ఒకటైన డెలాయిట్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన పాత ఉద్యోగానికి రాజీనామా చేసి, కొత్త ఆశలతో డెలాయిట్‌లో చేరాలని సిద్ధమవుతున్న తరుణంలో ఆ కంపెనీ ఆఫర్ లెటర్‌ను రద్దు చేయడం కలకలం రేపింది. ఈ చేదు అనుభవాన్ని సదరు ఇంజనీర్ రాజీవ్ అంజన సోషల్ మీడియాలో పంచుకోగా, అది చూసిన నెటిజన్లు ఇది బ్రేక‌ప్‌ కంటే దారుణమైన పరిస్థితి అని అభివర్ణిస్తున్నారు.

అసలేం జరిగింది?

రాజీవ్ అంజన డెలాయిట్ నిర్వహించిన కఠినమైన ఇంటర్వ్యూ రౌండ్లన్నీ విజయవంతంగా పూర్తి చేసి ఆఫర్ లెటర్ అందుకున్నాడు. కంపెనీ నిబంధనల ప్రకారం.. అతను తన ప్రస్తుత ఉద్యోగానికి రాజీనామా చేసి, నోటీసు పీరియడ్ కూడా పూర్తి చేశాడు. ఇక కొత్త కంపెనీలో జాయిన్ అవ్వడమే తరువాయి అనుకుంటున్న సమయంలో డెలాయిట్ బ్యాక్‌గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నుండి అతనికి ఒక ఇమెయిల్ వచ్చింది. డాక్యుమెంట్లలో లేదా వివరాల్లో ఏవో వ్యత్యాసాలు ఉన్నాయని, అందుకే ఆఫర్‌ను రద్దు చేస్తున్నామని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు.

Also Read: యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. ఎవ‌రీత‌ను?

నవ్వాలో ఏడవాలో తెలియని స్థితి

ఎంతో కష్టపడి బిగ్ 4 కంపెనీలో అవకాశం సంపాదించాను. తీరా చేరే సమయానికి ఇలాంటి షాక్ తగిలింది. పాత ఉద్యోగం వదిలేశాను, నోటీసు పీరియడ్ అయిపోయింది.. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అని రాజీవ్ తన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం సమస్య ఎక్కడ వచ్చిందో తెలుసుకుందామని హెచ్‌ఆర్ ప్రతినిధిని సంప్రదిస్తే ఆ వివరాలు అత్యంత రహస్యమని చెప్పడమే కాకుండా, తనను మళ్ళీ సంప్రదించవద్దని, భవిష్యత్తులో డెలాయిట్‌లో ఉద్యోగం రాకుండా ‘బ్లాక్‌లిస్ట్’ చేశారని రాజీవ్ ఆరోపించాడు.

నెటిజన్ల మద్దతు

ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఐటీ నిపుణులు డెలాయిట్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అభ్యర్థికి కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా ఆఫర్ రద్దు చేయడం ‘బిగ్ 4’ ప్రమాణాలకు విరుద్ధమని కొందరు మండిపడుతున్నారు. మరికొందరు అభ్యర్థులు తమకూ ఇలాగే ఆందోళనగా ఉందని, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే డాక్యుమెంట్లలో తీవ్రమైన తప్పులు ఉంటే తప్ప కంపెనీలు ఇలాంటి నిర్ణయం తీసుకోవు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

  Last Updated: 21 Apr 2026, 12:35 PM IST