Islamabad: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రస్తుతం వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య జరగాల్సిన ప్రతిపాదిత శాంతి చర్చలు ప్రారంభం కాకముందే విఫలమైనట్లు కనిపిస్తుండగా, మరోవైపు పాకిస్థాన్ ప్రభుత్వం నగరాన్ని యుద్ధ క్షేత్రంలాగా పూర్తిగా సీల్ చేసింది. అమెరికాతో తాము చర్చల మేజా వద్ద కూర్చోబోమని ఇరాన్ స్పష్టం చేసినప్పటికీ ఇస్లామాబాద్‌ను ‘రెడ్ జోన్’గా ప్రకటించి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
అతిథులు లేరు.. కానీ నగరం మాత్రం ‘లాక్’
దౌత్యపరంగా ఇది పాకిస్థాన్ అతిపెద్ద వైఫల్యంగా పరిగణించబడుతోంది. పాకిస్థాన్ ఆతిథ్యంలో జరగాల్సిన ఎటువంటి చర్చల్లోనూ తాము భాగం కాలేమని ఇరాన్ తెగేసి చెప్పింది. సాధారణంగా ఈ తిరస్కరణ తర్వాత ఏర్పాట్లు ఆగిపోవాలి. కానీ షెహబాజ్ ప్రభుత్వం రాజధానిని ఒక సైనిక స్థావరంలా మార్చేసింది. నగరంలోని ప్రధాన రహదారులపై కంటైనర్లను అడ్డుగా ఉంచారు. భారీగా భద్రతా బలగాలను మోహరించారు. అసలు ముఖ్య అతిథులే రానప్పుడు ఈ పహారా ఎవరి కోసం? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Also Read: లాస్ ఏంజెలెస్‌లో మహిళ అరెస్ట్.. ఇరాన్‌కు అక్రమంగా డ్రోన్ సప్లయ్.
కార్యాలయాలకు తాళాలు, స్కూళ్లు-కాలేజీలు బంద్
నేడు అంటే ఏప్రిల్ 20న ఇస్లామాబాద్ ‘రెడ్ జోన్’ దృశ్యం భయానక నిశ్శబ్దంతో నిండిపోయింది. అన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలను మూసివేసి ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఇచ్చారు. అంతేకాకుండా విద్యార్థుల చదువులకు కూడా బ్రేక్ పడింది. అన్ని స్కూళ్లు, కాలేజీలను మూసివేశారు. రోడ్లపై వాహనాల కంటే భద్రతా సిబ్బందే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రభుత్వం దీనిని ‘సెక్యూరిటీ ప్రోటోకాల్’ అని పిలుస్తోంది. కానీ వాస్తవానికి ఇది ప్రపంచ వేదికపై తన పరువు కాపాడుకోవడానికి పాకిస్థాన్ పడుతున్న తాపత్రయాన్ని చూపిస్తోంది.
పరువు కాపాడుకునే ప్రయత్నం.. బెడిసికొట్టిన వైనం
ఫిబ్రవరి 28 నుండి కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు, ఇంధన సంక్షోభాన్ని సృష్టించాయి. ఈ వివాదంలో మధ్యవర్తిగా వ్యవహరించడం ద్వారా తన కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థను, అంతర్జాతీయ ప్రతిష్ఠను మెరుగుపరచుకోవచ్చని పాకిస్థాన్ ఆశించింది. కానీ ప్రస్తుతం పాకిస్థాన్ వేసిన ఈ ఎత్తుగడ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. చర్చల మేజా ఖాళీగా పడి ఉంది. ఇస్లామాబాద్ ప్రజలు మాత్రం ఎటువంటి కారణం లేకుండా ‘లాక్డౌన్’ వంటి ఆంక్షల్లో నలిగిపోతున్నారు.
