Karnataka Woman Elopes With Lover 3 Months After Marriage : ఈ మధ్య కొంతమంది మహిళలు ఎలా ఆలోచిస్తున్నారో అర్ధం కావడం లేదు. తల్లిదండ్రులు చూసిన సంబంధం కాదని సొంతంగా ఒకరిని చూసుకోవడం , పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత సదరు వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడని తల్లిదండ్రుల వద్దకు రావడం వంటి సంఘటలు ఎన్నో జరుగుతున్నాయి. అలాగే తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం చేసుకొని , ఆ తర్వాత ఇబ్బందులు ఎదురుకొని పుట్టింటికి వెళ్లలేక , కోరుకున్న భర్త తో ఉండలేక తనువూ చాలిస్తున్నారు. తాజాగా పెళ్లైన మూడు నెలల తర్వాత కట్టుకున్న భర్త ను కాదని ప్రియుడి తో లేచిపోయింది ఓ నవ వధువు. ఈ ఘటన కర్ణాటకలోని దావణగెరి జిల్లా గుమ్మనూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
గుమ్మనూర్‌కు చెందిన హరీష్‌కు, హులికొట్టే గ్రామానికి చెందిన సరస్వతితో మూడు నెలల క్రితమే పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు వీరి సంసారం సాఫీగానే సాగింది. అయితే, సరస్వతి అప్పటికే శివకుమార్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న విషయాన్ని దాచిపెట్టి ఈ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.
గత నెల జనవరి 23న “గుడికి వెళ్లి వస్తాను” అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన సరస్వతి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన హరీష్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో ఆమె తన ప్రియుడు శివకుమార్‌తో కలిసి వెళ్లిపోయినట్లు తేలింది. ఈ వార్త హరీష్‌ను తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇలా మోసం చేసి వెళ్ళిపోవడమే కాకుండా, తనపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని హరీష్ తట్టుకోలేకపోయాడు. చివరకు సోమవారం నాడు తన ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు.
మరణానికి ముందు హరీష్ రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. తన భార్య సరస్వతి తనపై తప్పుడు వేధింపుల ఆరోపణలు చేసిందని, ఆమె బంధువులు తనను తీవ్రంగా బెదిరించారని ఆ నోట్‌లో పేర్కొన్నాడు. తన చావుకు భార్యే కారణమని స్పష్టం చేస్తూ హరీష్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ గ్రామంలో విషాద ఛాయలు నింపింది. అక్రమ సంబంధాలు, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎలా నిండు ప్రాణాలను బలి తీసుకుంటాయో అనడానికి ఈ ఘటనే నిదర్శనం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
