Bomb Prank : యూట్యూబ్‌‌ చూసి బాంబు తయారుచేసి.. టీచర్ కుర్చీ కింద పేల్చారు

క్లాస్‌ రూంలోకి ఆ టీచర్ రావడానికి కొన్ని నిమిషాల ముందు.. ఒక విద్యార్థి వెళ్లి  టీచర్ కుర్చీ కింద ఫైర్ క్రాకర్‌ను(Bomb Prank) అమర్చాడు.

Published By: HashtagU Telugu Desk
Students Bomb Prank On Haryana Teacher With Youtube Knowledge

Bomb Prank : ఏదైనా నేర్చుకోవాలి అనుకునే వారికి.. యూట్యూబ్ ఒక గురువు లాంటిది. అది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది.  దాన్ని మంచికీ వాడొచ్చు, చెడుకూ వాడొచ్చు. అయితే హర్యానా రాష్ట్రంలోని ఒక ఇంటర్ కాలేజీకి చెందిన కొందరు సెకండియర్ విద్యార్థులు యూట్యూబ్‌ను దుర్వినియోగం చేశారు. ఫైర్ క్రాకర్ తరహా చిన్నపాటి పేలుడు పదార్థాన్ని ఎలా తయారు చేయాలి అనేదాన్ని వాళ్లు  యూట్యూబ్ చూసి నేర్చుకున్నారు. అదే పద్ధతిని ఫాలో అయిపోయి.. ఒక ఫైర్ క్రాకర్‌ను సక్సెస్ ఫుల్‌గా తయారు చేశారు. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ప్రయోగాన్ని.. తమ క్లాస్‌రూంలోనే చేయాలని ఆ విద్యార్థులు డిసైడయ్యారు. ఈ తప్పుడు ఆలోచనను వారు ఆచరణలో పెట్టారు. గతంలో క్లాస్ రూంలో తమను తిట్టిన ఒక మహిళా టీచర్‌పై సదరు విద్యార్థులు కోపాన్ని పెంచుకున్నారు.

Also Read :Hypersonic Missile : భారత్ తొలి లాంగ్‌రేంజ్ హైపర్‌సోనిక్ మిస్సైల్ పరీక్ష సక్సెస్

క్లాస్‌ రూంలోకి ఆ టీచర్ రావడానికి కొన్ని నిమిషాల ముందు.. ఒక విద్యార్థి వెళ్లి  టీచర్ కుర్చీ కింద ఫైర్ క్రాకర్‌ను(Bomb Prank) అమర్చాడు. అనంతరం మహిళా టీచర్ వచ్చి ఆ కుర్చీలో కూర్చోబోతుండగా.. మరో విద్యార్థి తన వద్ద ఉన్న రిమోట్ కంట్రోల్‌తో  ఆ ఫైర్ క్రాకర్‌ను పేల్చేశాడు.  టీచర్ చూస్తుండగా ఇదంతా జరిగింది. కుర్చీ వద్ద పేలుడు జరిగిన వెంటనే టీచర్ పక్కకు జరిగారు. దీంతో ఆమెకు గాయాలు కాలేదు. మొత్తం మీద ఈ ఘటనను హర్యానా రాష్ట్ర విద్యాశాఖ సీరియస్‌గా తీసుకుంది. టీచర్ కుర్చీ కింద ఫైర్ క్రాకర్‌ను అమర్చిన 13 మంది విద్యార్థులను వారం రోజుల పాటు స్కూలు నుంచి సస్పెండ్ చేసింది.  దీనిపై విద్యాశాఖ దర్యాప్తు చేయిస్తోంది. అయితే ఈ ఘటనకు పాల్పడిన విద్యార్థులను క్షమిస్తున్నట్లు టీచర్ ప్రకటించారు.  ఇకపై తమ పిల్లలు అలా చేయబోరని 13 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు హామీ పత్రాన్ని అందించారు.

  Last Updated: 17 Nov 2024, 10:27 AM IST