Yogi Adityanath : ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిభాషా సూత్రం అమలుపై మాట్లాడుతూ..కీలక వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలోని పాఠశాలల్లో తమిళం, తెలుగు, కన్నడ భాషలనూ బోధిస్తున్నట్లు పేర్కొన్నారు. యూపీలోని కొన్ని పాఠశాలల్లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ వంటి భాషలను బోధిస్తున్నాం. దీని కారణంగా మా రాష్ట్రం ఏమైనా చిన్నదైపోతుందా?. లేదు కదా..! దీనివల్ల కొత్త ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలను సృష్టించగలుగుతున్నాం అని యోగి పేర్కొన్నారు. స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే త్రిభాషా విధానంపై వివాదాలు రాజేస్తున్నారని ఆరోపించారు. ఇది యువత ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు.
Read Also: Commercial cylinder : భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
ఇక, యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం స్పందించారు. రాష్ట్రానికి వచ్చే కార్మికులు తమిళం నేర్చుకుని రారని, హిందీ బలవంతంగా రుద్దాలనే మీ ఆలోచన ఆపేయాలని మండిపడ్డారు. తమిళ భాషను నేర్చుకునేందుకు ఎంత మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారనే వివరాలను కూడా బయటపెట్టాలన్నారు. తమిళనాడులోని విద్యార్థులు హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కార్తీ పేర్కొన్నారు. యూపీలో తమిళంలో పాఠాలు చెప్పేందుకు ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారనే వివరాలను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుందా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
కాగా, గత కొన్ని రోజులుగా జాతీయ విద్యావిధానంలోని (ఎన్‌ఈపీ-2020) త్రిభాషా సూత్రంపై రాజకీయ దుమారం రేగుతోంది. కొత్త విధానంలో భాగంగా మూడు భాషలను విద్యార్థులు నేర్చుకోవాల్సిందేనని, అందులో రెండు జాతీయ భాషలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం హిందీని అందరిపై బలవంతంగా రుద్దడానికే కేంద్రం దీనిని తెరపైకి తెచ్చిందని ఆరోపిస్తున్నాయి. దీంతో త్రిభాషా సూత్రంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.