Vallabhaneni Vamsi : వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎస్సీ, ఎస్టీ కోర్టులో షాక్ తగిలింది. దళిత యువకుడి కిడ్నాప్ కేసులో ఊరట లభించలేదు. తాజాగా, విజయవాడ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం వంశీకి ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగించింది. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే సత్యవర్ధన్ అనే దళిత యువకుడి కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం విజయవాడ జైలోల్ వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల కోర్టు వంశీకి ఈ నెల 25 వరకు రిమాండ్ విధించగా అది నేటితో ముగిసింది. దీంతో వంశీని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. మరోవైపు, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులోనూ వంశీ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో వంశీకి సీఐడీ కోర్టు మార్చి 28 వరకు రిమాండ్ విధించింది. వంశీ తో పాటుగా మరో నలుగురికి రిమాండ్ పొడిగించారు.
Read Also: Shihan Hussaini : పవన్ కల్యాణ్ గురువు షిహాన్ పేరిట ఎన్నో రికార్డులు.. ఇవిగో
వంశీ, అతని అనుచరులు గన్నవరం టీడీపీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని, సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తర్వాత సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించిన ఆరోపణలతో వంశీపై మరో కేసు నమోదైంది. ఈ కేసులో సెక్షన్ 140(1), 308, 351(3), మరియు SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో 2025 ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో వంశీని అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. నాటి నుంచి నేటి వరకు.. దాదాపు నెల రోజుల నుంచి వంశీ విజయవాడ జైలులోనే ఉన్నారు.
ఇక, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. దీంతో సీఐడీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అయితే, వల్లభనేని వంశీ బెయిల్‌పై ఈ నెల 27వ తేదీన సీఐడీ న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలంటూ సీఐడీ కోర్టును ఆశ్రయించారు వంశీ.. మరోవైపు వంశీకి బెయిల్ ఇవ్వద్దని అతడికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న కోర్టులో వాదనలు వినిపించారు సీఐడీ తరపు న్యాయవాది. ఇక, ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
Read Also: Warner : క్షేమపణలు కోరిన రాజేంద్రప్రసాద్