Man Kills GF and Dies: గర్ల్ ఫ్రెండ్ ను గొంతు నులిమి చంపి పెరట్లో పాతిపెట్టాడు.. ఆ మరుక్షణమే..?!

క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించే సీన్ అది. ఓ ఇంట్లో తనిఖీలకు వెళ్లిన పోలీసులకు చనిపోయిన స్థితిలో 60 ఏళ్ల వృద్ధుడు కనిపించాడు.

  • Written By:
  • Publish Date - May 12, 2022 / 12:21 PM IST

క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించే సీన్ అది. ఓ ఇంట్లో తనిఖీలకు వెళ్లిన పోలీసులకు చనిపోయిన స్థితిలో 60 ఏళ్ల వృద్ధుడు కనిపించాడు. చుట్టూ పరిసరాలను పరిశీలించగా.. ఇంటి పెరట్లో అప్పుడే మట్టితో కప్పిన ఒక ప్రదేశం కనిపించింది. అనుమానంతో అక్కడ తవ్వకాలు జరిపించగా.. ఒక 65 ఏళ్ల వృద్దురాలి మృతదేహం బయటపడింది. దీంతో ఆ ఇద్దరు ఎవరు ? ఎలా చనిపోయారు ?

అనే ప్రశ్నలకు సమాధానాలను వెతికే పనిలో పోలీసులు పడ్డారు. ఈక్రమంలో తమకు ఫోన్ చేసి ఆ ఇంట్లో తనిఖీ చేయాలనే సమాచారాన్ని ఇచ్చిన పమేలా బ్రిగ్స్ అనే మహిళను ఖాకీలు విచారించారు. దీంతో అసలు నిజం బయటపడింది. మృతిచెందిన 65 ఏళ్ల వృద్దురాలి పేరు ప్యాట్రీషియా డెంట్. పమేలా బ్రిగ్స్, డెంట్ ఇద్దరూ కవల పిల్లలు. ప్యాట్రీషియా డెంట్, అమెరికాలోని దక్షిణ కరోలినా ప్రాంతానికి చెందిన జోసెఫ్ మెక్ ఇనాన్ తో చాలా ఏళ్లుగా సహ జీవనంలో ఉంది.

అయితే పమేలా బ్రిగ్స్, డెంట్ రోజూ ఒకరికొకరు ఫోన్ కాల్ చేసుకొని మాట్లాడుకునే వారు. మెసేజ్ లు చేసుకునే వారు. కానీ అకస్మాత్తుగా ఒకరోజు సోదరి ప్యాట్రీషియా డెంట్ నుంచి పమేలా బ్రిగ్స్ కు కాల్స్ రాలేదు. దీంతో ఆందోళన చెందిన పమేలా బ్రిగ్స్ పోలీసులకు ఫోన్ చేసి, తన కవల సోదరి డెంట్ కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నేరుగా ప్యాట్రీషియా డెంట్, మెక్ ఇనాన్ ఉండే ఇంటికి వెళ్లారు. ఇంటి పెరటికి దగ్గర్లో విగత జీవిగా మెక్ ఇనాన్ కనిపించాడు. సందేహం వచ్చి మొత్తం ఇంటి పరిసరాలను జల్లెడ పట్టగా.. పెరట్లో అప్పుడే పేర్చినట్టుగా ఉన్న మట్టి కుప్ప కనిపించింది.

దాన్ని తవ్వించగా పమేలా బ్రిగ్స్ సోదరి ప్యాట్రీషియా డెంట్ మృతదేహం బయటపడింది. మెక్ ఇనాన్ గొంతు నులిమి డెంట్ ను చంపి పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే గుండెపోటు రావడంతో మెక్ ఇనాన్ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడని నిర్ధారించారు. అయితే మెక్ ఇనాన్ ఈ హత్య చేయడానికి కారణం ఏమిటి ? హత్య తర్వాత అతడికి నిజంగానే గుండెపోటు వచ్చిందా ? లేదా ఇంకేమైనా జరిగిందా ? అనేది మిస్టరీగా మిగిలింది.