Harish Rao : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, నోటిఫికేషన్ల రాకతో యువత నిరాశకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కోదండరాం, ఆకునూరి మురళి, ప్రియాంక గాంధీలకు మాత్రం పదవులు లభించాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ యువతలో ఆశలు నింపింది. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. యువత నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుంటే, ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు వద్దంటూ యువతే ఆందోళనలు చేస్తోందని అపప్రచారం చేస్తోంది. ఇది అమానుషం అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను తీవ్రంగా మోసం చేస్తోందని, హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌కు బదులుగా ‘దగా క్యాలెండర్’ను అమలు చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు.
Read Also: Mahaa News : మహాన్యూస్ ఆఫీస్ పై దాడి..లోపల ఫేమస్ హీరో
ఇదే సందర్భంలో హరీశ్ రావు తమ బీఆర్ఎస్ పాలనలో 1.62 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యువతతో మోసంగా వ్యవహరిస్తోందని, ఎన్నికల సమయంలో చేసిన హామీలను సాకుగా మిగిలిపెట్టిందని మండిపడ్డారు. ప్రియాంక గాంధీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్‌ను కూడా ప్రస్తావించిన హరీశ్ ఆ హామీలతోనే కాంగ్రెస్ ఓట్లు సంపాదించింది. మరి ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చకుండా ఎలా తప్పించుకుంటారు? 2 లక్షల ఉద్యోగాల భర్తీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. నిరుద్యోగుల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ యువత తలపెట్టిన ‘ఛలో సచివాలయం’ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని హరీశ్ రావు ప్రకటించారు. నిరుద్యోగుల ఉద్యమానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారి న్యాయమైన హక్కుల సాధన కోసం ప్రతి స్థాయిలో పోరాడతామని భరోసా ఇచ్చారు. అంతేకాక, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో ప్రభుత్వం చూపుతున్న జాప్యాన్ని కూడా హరీశ్ తప్పుపట్టారు. బకాయిలను విడుదల చేస్తే కమిషన్లు రావని భావించి ఆంధ్రా నిలిపేశారా? అని ప్రభుత్వాన్ని కఠినంగా ప్రశ్నించారు. అంతిమంగా, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో విఫలమవుతుంటే, అసెంబ్లీ వేదికగా కూడా ఈ విషయంపై ప్రభుత్వం జవాబుదారీగా ఉండాల్సిందేనని హరీశ్ రావు హెచ్చరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది. యువత ఆశలు నెరవేరే వరకు బీఆర్ఎస్ వెనుకడుగు వేయదు అని స్పష్టంగా తెలిపారు.