PM Modi: భారతదేశ చరిత్రలో 1975లో విధించబడిన ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని, ఆ రోజులను ఏ భారతీయుడూ మరిచిపోలేడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి నేటికి సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ రోజును మేము ‘సంవిధాన్ హత్యా దినంగా’ గుర్తుచేసుకుంటున్నాం. ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టి, ప్రజల స్వేచ్ఛలను హరిస్తూ, మూగబెట్టే ప్రయత్నం చేసిన దురంత ఘటన ఇది. దేశ రాజ్యాంగ విలువలను తునాతునకలు చేసిన శాసనాన్ని తలుచుకుంటే బాధ కలుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Bandi Sanjay : ఎమర్జెన్సీ పాలన చీకటి అధ్యాయం : బండి సంజయ్
ప్రధాని మోడీ ఎమర్జెన్సీ సమయంలో జరిగిన అరాచకాలను ఖండిస్తూ ఆ రోజుల్లో ప్రాథమిక హక్కులు కాలరాసి, పత్రికా స్వేచ్ఛను అణిచివేశారు. రాజకీయ నాయకులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, సామాన్య పౌరులు ఎవ్వరూ మినహాలేదు అందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి జైళ్లలో ఉంచారు. ప్రజాస్వామ్య వ్యవస్థనే అరెస్ట్ చేసినట్లుగా అప్పటి ప్రభుత్వం వ్యవహరించింది అని తీవ్ర విమర్శలు చేశారు. ఎమర్జెన్సీ విధించబడిన నాటి దారుణ పరిస్థితులను భారతీయులు మరచిపోలేరని మోదీ పునరుద్ఘాటించారు. “ఆ చీకటి కాలానికి వ్యతిరేకంగా స్వరాన్ని ఎత్తిన ప్రతి వ్యక్తికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. వారు ప్రాణాల మీదకు తెచ్చుకొని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసిన పోరాటం వల్లే చివరికి దేశం తిరిగి గమ్యాన్ని చేరగలిగింది అని కొనియాడారు.
ఈ సందర్భంగా ప్రధాని తన ప్రభుత్వం రాజ్యాంగ బలాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని చెప్పారు. వికసిత భారత్ లక్ష్య సాధన కోసం నిరంతరంగా ప్రయత్నిస్తున్నాం. పేదలు, అణగారిన వర్గాలు, సామాజికంగా వెనుకబడిన ప్రజల కలలను సాకారం చేయడమే మా ధ్యేయం అని స్పష్టంగా పేర్కొన్నారు. అదే సమయంలో, ఎమర్జెన్సీ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తన కొత్త పుస్తకాన్ని ప్రకటించారు. ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ అనే పేరుతో త్వరలో పుస్తకం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్ఎస్‌ఎస్ కార్యకర్తగా నేను అనుభవించిన ఎమర్జెన్సీ కాలం, ఆ రోజుల్లో నెలకొన్న పరిస్థితులు, మానవ హక్కులపై జరిగిన దాడులు ఇవన్నీ ఈ పుస్తకంలో పొందుపరిస్తున్నాను అని మోడీ పేర్కొన్నారు. ఈ పుస్తకం ద్వారా అప్పటి అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తంగా, దేశ ప్రజల మద్దతుతో ప్రజాస్వామ్యాన్ని రక్షించగలగినట్లు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి భారతీయుడు తమ బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ సూచించారు.