Etela Rajender : తెలంగాణను దివాలా రాష్ట్రంగా చూపడాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు. “తెలంగాణ ఒక పేద రాష్ట్రం కాదు, ఇది వనరులతో సమృద్ధిగా ఉన్న ప్రాంతం. కానీ పాలకులు, నాయకుల వైఫల్యం వల్ల వెనుకబడ్డ రాష్ట్రంగా మార్చబడింది” అని వ్యాఖ్యానించారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించడం తగదు అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. ‘‘స్వాతంత్ర్యానికి ముందే తెలంగాణలో రైలు మార్గాలు, విద్యుత్, టెలిఫోన్ వంటి మౌలిక వసతులు ఉన్నాయని చరిత్ర చెబుతోంది. అలాంటి ప్రాంతాన్ని ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం దివాలా రాష్ట్రమని చూపడం తగదు’’ అని చెప్పారు.
Read Also: YCP : వామ్మో.. వైసీపీ ఓటమిని కర్ణుడి చావుతో లింక్ పెట్టిన బొత్స
ఈటల వివరించిన విధంగా, 2014లో తెలంగాణ సొంత పన్నుల ఆదాయం రూ.29 వేల కోట్లుగా ఉండగా, ప్రతి ఏడాది రూ.5వేల కోట్లు నుంచి రూ.10వేల కోట్ల వరకు పెరుగుతూ వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆదాయం రూ.1.19 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. అలాగే పన్నేతర ఆదాయం కూడా 2014లో రూ.6 వేల కోట్లు కాగా, ఇప్పుడు రూ.20 వేల కోట్లకు పెరిగిందని వివరించారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా కూడా సంవత్సరానికోసారి పెరుగుతోందన్నారు. ధాన్యం దిగుబడి, రాష్ట్ర వృద్ధిరేటు, జీఎస్‌డీపీ, అత్యధిక బడ్జెట్ వంటి రంగాల్లో తెలంగాణ దేశంలో ముందున్నదని పేర్కొన్నారు. “కొత్త రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లే అయినా, రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజలలో అపోహలు కలిగించేలా ఉన్నాయి. ఆత్మగౌరవాన్ని నాశనం చేసే విధంగా ఉండకూడదు” అన్నారు. ఈటల మాటల్లో తెలంగాణ ప్రజల కృషి, పోరాటమే ఈ స్థితికి కారణమని స్పష్టంగా కనిపించింది.
Read Also: Terrorist Attack : ప్రధాని మోడీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ