Site icon HashtagU Telugu

Solidarity Rally : నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ

CM Revanth

CM Revanth

Solidarity Rally : భారత సైన్యానికి మద్దతుగా నేడు (గురువారం) హైదరాబాద్‌లో సంఘీభావ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్‌ రోడ్ వరకూ ఈ ర్యాలీ సాగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరై ర్యాలీని ప్రారంభించనున్నారు. భారత సైనికుల సేవలకు గౌరవం తెలుపుతూ, ప్రజల్లో దేశభక్తి భావాలను ప్రేరేపించేందుకు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా, ప్రజల మద్దతుతో సాగనున్న భారీ సంఘీభావ యాత్రగా మారనుంది. పలు విద్యార్థి సంఘాలు, యువజన సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఇందులో పాల్గొననున్నాయి. ర్యాలీ సందర్భంగా త్రివర్ణ పతాకాలు, దేశభక్తి నినాదాలతో నగరవాసులు పాల్గొంటున్నారు.

Read Also: Uttarakhand : కూలిన హెలికాప్టర్‌.. ఐదుగురు టూరిస్టులు మృతి

కాగా, పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడుల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా సమర్థంగా ఎదుర్కొందామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఆపరేషన్ సిందూర్, మాక్‌డ్రిల్‌ అనంతర పరిస్థితులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొనున్నారు.

మరోవైపు హైడ్రా విభాగం కార్యకలాపాలకు మరింత బలం చేకూర్చేలా మరో కీలక అడుగు వేయబోతున్నారు. బుద్ధభవన్ పక్కన హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ నూతన పోలీస్ స్టేషన్‌ను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళే ప్రారంభించనున్నారు. డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ విభాగాల మాదిరిగానే హైడ్రా స్పెషలైజ్డ్ విభాగానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ పోలీస్ స్టేషన్‌ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకునే వీలవుతుంది.

హైడ్రా పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ పి.తిరుమల్‌ను SHOగా నియమించారు. మొదటి దశలో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుల్స్‌ను నియమించారు. 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ స్టేషన్‌ హైడ్రా విభాగానికి పెద్ద ఊతమివ్వనుంది. ఈరోజు జరిగే సంఘీభావ ర్యాలీతో పాటు హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం కూడా ఒక స్ఫూర్తిదాయక ఘట్టంగా నిలవనుంది.

Read Also: Belly Fat: వీటిని నానబెట్టి తింటే చాలు.. బాణ లాంటి పొట్ట అయినా కరిగి స్లిమ్ గా అవ్వాల్సిందే!