Banglades : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాలోని తన మద్దతుదారులను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ చర్యలను దుయ్యబట్టారు. నిప్పుతో చెలగాటమాడితే అది మిమ్మల్నే దహించి వేస్తుందని హెచ్చరించారు. అధికార దాహంతో విదేశీయులతో కలిసి దేశ పతనానికి యత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ వడ్డీ వ్యాపారి, అధికార, ధన దాహం కలిగిన స్వార్థపరుడు విదేశీయులతో కలిసి కుట్ర పన్నాడు. దేశాన్ని నాశనం చేయడానికి విదేశీ సంపదను ఉపయోగించాడు. అక్కడి రాజకీయ పార్టీలు అవామీ లీగ్ నాయకులపై దారుణాలకు ఒడిగడుతున్నాయి అని మండిపడ్డారు.
Read Also: Djembe Therapy: ఆనందం, ఆహ్లాదం అందించే జెంబే థెరపీ.. ఎలా ?
బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించి అన్ని గుర్తులను చెరిపేస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధులను అవమానిస్తున్నారు. వారికి గుర్తుగా అన్ని జిల్లాల్లో నిర్మించిన భవనాలను తగలబెడుతున్నారు. ఈ చర్యలను యూనస్ సమర్థించుకుంటున్నారా..? మీరు నిప్పుతో చెలగాటమాడితే అది మిమ్మల్ని దహించివేస్తుందన్నారు. కాగా, మరోసారి హసీనాపై అక్కడి న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారంటూ హసీనాతో పాటు ఆమె సోదరి రెహనా, మరికొందరిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం అరెస్టు వారెంట్ జారీ అయింది.
ఇక, షేక్ హసీనా గతంలో కూడా మహమ్మద్ యూనస్ పై విమర్శలు గుప్పించారు. త్వరలో బంగ్లాకు తిరిగి వస్తానని అన్నారు. ఒక్క రోజులోనే నా తండ్రి, తల్లి, సోదరుడిని కోల్పోయాను. నాడు వారు మమ్మల్ని దేశంలోకి రానివ్వలేదు. నేను తిరిగి వచ్చాక అన్యాయం చేసిన వారందరికీ కఠిన శిక్ష అమలు చేస్తా అని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మీ సొంత వారిని కోల్పోయి ఇప్పుడు మీరంతా అనుభవిస్తున్న బాధను నేను అర్థం చేసుకోగలను. నా ద్వారా మీ అందరికీ మంచి చేయాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాడేమో. అందుకే నన్ను ఇంకా రక్షిస్తున్నాడు. అవామీ లీగ్ పార్టీ సభ్యులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్న వారికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందని షేక్ హసీనా అన్నారు.
Read Also: TG SC Classification GO : ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం