Site icon HashtagU Telugu

TGPSC Group-1 : గ్రూప్‌-1 నోటిఫికేషన్‌పై హైకోర్టులో తీర్పు రిజర్వు

Reserved judgment in High Court on Group-1 notification

Reserved judgment in High Court on Group-1 notification

Telangana High Court :  తెలంగాణ హైకోర్టులో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌పై విచారణ ముగిసింది. తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. గ్రూప్‌-1 పరీక్షల కీపై అభ్యంతరాలు స్వీకరించామని, వాటిని ఆయా సబ్జెక్ట్‌ల వారీగా నిపుణుల కమిటీకి పంపి.. వారు ఆమోదించిన తర్వాతే ఫలితాలు విడుదల చేసినట్లు టీజీపీఎస్సీ (TGPSC) హైకోర్టుకు నివేదించింది. త్వరలో మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయని, ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోరాదని, దీనివల్ల అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొంది.

Read Also: Pakistan : పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్న విదేశాంగ మంత్రి జైశంకర్

గ్రూప్‌-1 పోస్టుల భర్తీ నిమిత్తం 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్‌ జారీ చేయడం చెల్లదని, ప్రాథమిక కీలో తప్పులున్నాయని, వాటిని సవరించాలన్న అభ్యంతరాలను పట్టించుకోకపోవడాన్ని సవాల్‌ చేస్తూ పలువురు అభ్యర్థులు రెండు వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ విచారణ చేపట్టారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి, టీజీపీఎస్సీ తరఫున ఎం.రాంగోపాల్‌రావులు వాదనలు వినిపిస్తూ పరీక్షలు రాసిన 3 లక్షల మంది నుంచి ప్రిలిమ్స్‌ కీపై భౌతికంగా 721, ఆన్‌లైన్‌ ద్వారా 6,470 అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు.

వాటిని నిపుణుల కమిటీ పరిశీలించిందన్నారు. ప్రధానంగా ఉన్నవాటిని పరిగణనలోకి తీసుకుని కమిటీ సిఫారసుల మేరకు రెండు ప్రశ్నలను తొలగించి కీని విడుదల చేశామని వివరించారు. ప్రస్తుతం పిటిషన్‌ దాఖలు చేసిన ఐదుగురిలో ఒక్కరే కమిషన్‌కు అభ్యంతరాలు తెలియజేశారన్నారు. మిగిలినవారు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా కోర్టును ఆశ్రయించారన్నారు. రెండోసారి నోటిఫికేషన్‌ జారీని సవాల్‌ చేసిన అభ్యర్థితో పాటు కీని సవాల్‌ చేసిన పిటిషనర్లలో ముగ్గురు మెయిన్స్‌కు అర్హత సాధించారన్నారు. ప్రశ్నలకు విశ్లేషణాత్మకంగా ఆలోచించి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని, ఒకరిద్దరికి అర్థం కానంత మాత్రాన అవి తప్పులైనట్లు కాదన్నారు. పరీక్షలను నిష్పాక్షికంగా నిర్వహిస్తున్నామని, ఈ పిటిషన్‌లను కొట్టివేయాలని కోరారు. వాదనలు పూర్తికాకపోవడంతో తదుపరి విచారణను న్యాయమూర్తి శుక్రవారానికి వాయిదా వేశారు. ఈరోజు కూడా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది.

Read Also: Pleasure Marriage: విహారయాత్రకు ఇండోనేషియా వెళ్లండి.. భార్య‌ను పొందండి..!