Gali Janardhan Reddy : ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైప్రొఫైల్ కేసుగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి వి.డి. రాజగోపాల్ అనే నలుగురు నిందితులకు బెయిల్ మంజూరైంది. ఈ బెయిల్ మంజూరుతో వారికెంతమాత్రం ఊరట లభించినా, కొన్ని కీలక షరతులు విధించబడ్డాయి. తాజాగా మే 6న నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో నలుగురినీ దోషులుగా గుర్తించి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20,000 జరిమానా విధించింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న రాజగోపాల్‌కు అదనంగా మరో నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.
Read Also: Google Map : ప్రాణాల మీదకు తెచ్చిన గూగుల్ మ్యాప్
ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టు నిందితులకు తాత్కాలిక ఊరటను కలిగిస్తూ, వారికి బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేస్తూ, దేశం విడిచి వెళ్లరాదు అనే షరతుతో పాటు ఒక్కొక్కరూ రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. కేసు విచారణ కొనసాగుతున్నందున నిందితులు కోర్టుకు సహకరించాల్సిన బాధ్యత కూడా మోపింది. ఈ కేసు దాదాపు పదిహేనేళ్లుగా నడుస్తూ వస్తోంది. ఓబుళాపురం మైనింగ్ కాంట్రాక్టుల్లో అక్రమాలు, బోగస్ లైసెన్స్‌లు, ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం వంటి అంశాలతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తల సంబంధాలు వెలుగులోకి రావడంతో అప్పట్లో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు తాజా తీర్పుతో నిందితులకు తాత్కాలికంగా ఊరట లభించినా, కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదనే విషయం మర్చిపోకూడదు. తుది తీర్పు వరకు న్యాయపరమైన పోరాటం ఇంకా కొనసాగనుంది.
Read Also: KCR : కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. బీఆర్కే భవన్ వద్ద భారీ బందోబస్తు