Site icon HashtagU Telugu

Raitu Nestam program : మా ప్రజాప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యం రైతులే : సీఎం రేవంత్‌ రెడ్డి

Vanamahotsava Program

Vanamahotsava Program

Raitu Nestam program : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 9 రోజుల వ్యవధిలో రూ. 9 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా ఇది దేశంలోనే అత్యంత వేగంగా అమలైన రైతు మద్దతు పథకాలలో ఒకటిగా నిలిచిందని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. మా ప్రభుత్వంలో రైతులకే ప్రథమ ప్రాధాన్యం. వాళ్ల తర్వాత మహిళలు, యువత అన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టే రుణ మాఫీను నెరవేర్చామని, ఇప్పటివరకు 25 లక్షల మంది రైతులకు ఇది ప్రయోజనం చేకూర్చిందని వెల్లడించారు.

Read Also: Blood pressure : రక్తపోటును నియంత్రించే వెల్లుల్లి.. నిద్రలేమికి పర్‌ఫెక్ట్ మెడిసిన్ 

వ్యవసాయాన్ని దండగ అన్న స్థితి నుంచి పండగగా మార్చడం మా లక్ష్యం. రైతు పండిస్తే బోనస్ ఇస్తాం అన్న మాట నిలబెట్టాం. వరి వేసినా ఉరి వేస్తానన్న గత ముఖ్యమంత్రి మాటలను ప్రజలు మరచిపోలేరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత, సన్న వడ్లు పండిస్తే కూడా బోనస్ ఇచ్చాం. పైగా 48 గంటల్లోనే డబ్బు జమ చేయడం ద్వారా రైతుల నమ్మకాన్ని పొందాం అని అన్నారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రూ. 8 లక్షల కోట్ల అప్పులు రాష్ట్రంపై మోపారు. రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టినా అది కూలిపోయింది. ఫామ్ హౌస్‌లు ఎలా వచ్చాయి? పాఠశాలలు మూతపడిన సమయంలో వాళ్ల సంపద ఎలా పెరిగింది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో మాత్రం 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, గ్రామాల్లో ‘అమ్మ ఆదర్శ పాఠశాలలు’ స్థాపించామని చెప్పారు.

మహిళల అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి సారించినట్టు సీఎం చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టుపై ఒప్పందం చేసాం. రూ. 21 వేల కోట్ల వడ్డీలేని రుణాలు, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు చర్యలు తీసుకున్నాం. శిల్పారామంలో 150 షాపుల స్థలాన్ని కేటాయించాం. ఆర్టీసీకి వెయ్యి బస్సులు మహిళల వద్ద అద్దెకు తీసుకునేలా పథకం రూపొందించాం అంతేకాకుండా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? అంటూ మాజీ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. మీరు చెప్పిన తేదీకి అసెంబ్లీలో చర్చకు వస్తాను. సంతకాలు, ఆధారాలతో వస్తాను. ఒకరోజు గోదావరి, రెండో రోజు కృష్ణా జలాలపై చర్చిద్దాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి, తెలంగాణలో రైతు సంక్షేమం, మహిళా సాధికారతపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల ముందుంచారు. రైతు భరోసా ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో రైతులకు మరింత ప్రాధాన్యం కల్పించినట్టు తెలుస్తోంది.

Read Also: Neopolis: రూ. 3169 కోట్లతో నిర్మాణం.. హైద‌రాబాద్‌లో నియోపోలిస్ భారీ ప్రాజెక్ట్!