Site icon HashtagU Telugu

Congress : అధికారంలో ఉన్నప్పుడు కవిత.. బీసీల గురించి మాట్లాడారా?: మహేశ్‌ కుమార్‌గౌడ్‌

Did Kavitha talk about BCs when she was in power?: Mahesh Kumar Goud

Did Kavitha talk about BCs when she was in power?: Mahesh Kumar Goud

Congress : బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్రంగా స్పందించారు. కవిత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖను ఆయన హాస్యాస్పదంగా అభివర్ణించారు. హైదరాబాద్‌లో గాంధీ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేశ్‌కుమార్‌ గౌడ్ మాట్లాడారు. కవిత లేఖను ఎందుకు, ఎవరి హోదాలో రాసిందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు ఈ లేఖను భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) నాయకురాలిగా రాసారా? లేక జాగృతి అధ్యక్షురాలిగా రాసారా? అని ప్రశ్నించారు. పదేళ్లపాటు తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు బీసీలపై కవిత ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆయన నిలదీశారు.

Read Also: Dalai Lama : వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకే ఉంది : భారత్‌

కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లను 34 శాతం నుంచి 21 శాతానికి తగ్గించిందని, ఇది బీసీలకు తీవ్ర అన్యాయం అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో కవిత ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలని మహేశ్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. అంతేకాక, 2014 నుంచి 2018 వరకు తెలంగాణ కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రిణీ లేకపోయినా, మహిళల తరఫున కవిత ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మీరు మహిళా ఉద్యమాల నాయకురాలిగా మాట్లాడుతున్నప్పుడు, మహిళలకు మంత్రి పదవులు ఇవ్వకపోతే ఎందుకు పోరాటాలు చేయలేదని ఆయన మండిపడ్డారు. మహిళా సాధికారత, బీసీల హక్కుల గురించి ఇప్పుడు మాట్లాడడం రాజకీయ పతనాన్ని కప్పిపుచ్చేందుకు చేసే ప్రయత్నమేనని విమర్శించారు.

శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ‘సామాజిక సమరభేరి’ పేరిట భారీ బహిరంగ సభను టీపీసీసీ ఏర్పాటు చేయనుందని మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొని గ్రామ కమిటీల సభ్యులతో మాట్లాడనున్నారని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాల సమస్యలను కేంద్ర నేతల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్‌ పార్టీ బీసీల హక్కులకు కట్టుబడి ఉందని నిరూపించబోతున్నట్టు తెలిపారు. ఒక్క లేఖ రాయడం కాదు… న్యాయం చేయాలంటే హృదయం కావాలి అంటూ కవితపై ఆయన వ్యాఖ్యలు ముగించారు.

Read Also: CM Chandrababu : తెలంగాణ ప్రాజెక్టులను ఎప్పుడూ వ్యతిరేకించలేదు – చంద్రబాబు