Cyprus: ప్రస్తుతం మూడు దేశాల విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆదివారం సాయంత్రం ద్వీపదేశమైన సైప్రస్ చేరుకున్నారు. లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ స్వయంగా మోడీకి ఘన స్వాగతం పలికారు. ఇది రెండు దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి సైప్రస్ గడ్డపై అడుగుపెడుతున్న అరుదైన సందర్భం కావడం గమనార్హం. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీకి సైప్రస్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3’ను ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని అందుకుంటూ మోడీ మాట్లాడారు. ఈ పురస్కారం 140 కోట్ల భారతీయుల తరపున వచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. సైప్రస్ ప్రభుత్వానికి, ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పారు.
Read Also: SBI FD rates : ఎస్‌బీఐ ఎఫ్‌డీ రేట్లలో కోత.. తాజా వడ్డీ రేట్ల వివరాలు ఇవీ..
ఈ పురస్కారం రెండు దేశాల మధ్య ఉన్న మైత్రి, శాంతియుత సహజీవనం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఇది వసుధైవ కుటుంబకం భావనకు, భారత-సైప్రస్ మధ్య ఉన్న మానవీయ బంధానికి ప్రతిరూపం. ఈ అవార్డును ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకితంగా అర్పిస్తున్నాను అని పేర్కొన్నారు. భారత్ మరియు సైప్రస్ సంబంధాలు గత కొన్ని దశాబ్దాల్లో స్థిరంగా ముందుకు సాగుతున్నాయని, అయితే ఈ పర్యటన ద్వారా వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత తదితర రంగాల్లో మరింత సన్నిహిత సహకారానికి మార్గం సుగమమవుతుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఇరుదేశాలు తమ దేశాల అభివృద్ధి ప్రయాణంలో సహయాత్రికులుగా మారుతాయి. ప్రపంచంలో శాంతి, భద్రత, భౌగోళిక సమగ్రత కోసం కలిసి పనిచేస్తాయి అని అన్నారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల మంత్రిత్వ శాఖల మధ్య పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని సమాచారం. భారత్ నుండి సైప్రస్‌కి విద్యార్ధులు, వృత్తి నిపుణుల వలసలు, ద్వైపాక్షిక పెట్టుబడుల విస్తరణ వంటి అంశాలు చర్చకు వస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. మోదీ తన మూడు దేశాల పర్యటనలో మొదటి దశగా సైప్రస్ చేరగా, అక్కడి నుంచి ఆయన కెనడా ప్రయాణించనున్నారు. అక్కడ జరిగే జీ7 సదస్సులో అతిథి నాయకుడిగా పాల్గొననున్నారు. అనంతరం ఆయన క్రొయేషియా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల పరంగా చారిత్రాత్మకంగా నిలిచే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: Matangeshwar Temple : ఏటా పెరుగుతున్న శివలింగం..ఎక్కడుందా ఆలయం? విశేషాలేంటి? తెలుసుకుందాం!