Chennai : దేశంలో డ్రగ్స్ మాఫియాను పూర్తిగా సమూలంగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా రాష్ట్రాలన్నింటిలోని టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, పోలీసు విభాగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మాదక ద్రవ్యాల సరఫరా, దాచి ఉంచే ప్రయత్నాలు ఎక్కడ చోటు చేసుకున్నా వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నది కేంద్రం ఆదేశం. ఈనేపథ్యంలో దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని రద్దీగల కూడళ్లల్లో పోలీసు, కస్టమ్స్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల లగేజీ, ట్రావెల్ హిస్టరీలను ఖచ్చితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు అధికారులు.
Read Also: KTR: ఆ సెక్షన్ల కింద కేటీఆర్‌పై కేసు నమోదు
ఈ తనిఖీల సమయంలో థాయ్‌లాండ్ నుంచి శ్రీలంక మీదుగా చెన్నైకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులపై అనుమానం వచ్చి వారి లగేజీని సోదా చేయగా.. అందులో భారీగా మాదకద్రవ్యాలు బయటపడ్డాయి. ప్రయాణికులు తెలివిగా ఆహార పదార్థాల్లో మిక్స్ చేసి డ్రగ్స్‌ను బెంగళూరుకు తరలించేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. వారు తరలిస్తున్న డ్రగ్స్ విలువ దాదాపు రూ. 3.8 కోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మాదకద్రవ్యాలలో ముఖ్యంగా గంజాయితో పాటు ఇతర సింథటిక్ డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. ప్రయాణికులు మాదకద్రవ్యాలను ప్యాక్ చేసిన విధానం, వారి ప్రయాణ మార్గం, మరియు వారి వెనుక ఉన్న ముఠా సభ్యులపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. వీరిని మద్రాస్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారి ఆధ్వర్యంలో విచారిస్తున్నారు.
కస్టమ్స్ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం, నిందితులు డ్రగ్స్‌ను సాధారణ ఫుడ్ ప్యాకెట్లలో దాచి, డబ్బాలు లేదా స్పైసెస్ లాగా తయారుచేసిన ప్యాకేజింగ్‌లో మాయం చేయాలని భావించారు. అయితే, సాంకేతిక పరికరాలతో, అనుభవజ్ఞులైన అధికారుల పర్యవేక్షణలో జరిగిన తనిఖీలతో వారి ప్రయత్నం విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న గట్టి చర్యల ఫలితంగా ఇటువంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయని, రానున్న రోజుల్లో డ్రగ్స్ వ్యాపారాన్ని పూర్తిగా అణచివేసేందుకు మరింత సమగ్ర చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ ప్రతినిధులు పేర్కొన్నారు.