Site icon HashtagU Telugu

Budget session : లోక్‌సభ నిరవధిక వాయిదా.. ముగిసిన బడ్జెట్ సమావేశాలు..

Budget session of Lok Sabha adjourned indefinitely

Budget session of Lok Sabha adjourned indefinitely

Budget session : లోక్‌సభ శుక్రవారం నిరవధికంగా వాయిదా పడింది. లోక్‌సభ ప్రారంభమైన అనంతరం కాంగ్రెస్‌ నేత సోనియాగాంధీ వ్యాఖ్యలపై కొన్ని నిమిషాల పాటు సభ వాయిదా పడింది. అనంతరం మద్యాహ్నం 12.00 గంటలకు సభ సమావేశమైన వెంటనే.. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తన ముగింపు వ్యాఖ్యలను చదివి, సభను నిరవధికంగా వాయిదా (కొత్త సమావేశం ప్రారంభమయ్యే వరకు) వేస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 31న ప్రారంభమైన బడ్జెట్‌ సమావేశాలకు నేటితో ముగింపు పలికినట్లైంది. ఈ సమావేశాల్లో సభ ఉత్పాదకత 118 శాతం కంటే ఎక్కువ ఉందన్నారు. స్పీకర్‌ ప్రసంగ సమయంలోనూ ప్రతిపక్షనేతలు ఆందోళన కొనసాగించారు.

Read Also: Vamanarao murder case : వామనరావు హత్య కేసు.. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపుర్‌ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ కూడా క్లియర్‌ అయినట్లు తెలిపారు. ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీని సభలో మాట్లాడనివ్వకుండా వివక్షచూపించారంటూ నినాదాలు చేశారు. ఎలాంటి చర్చ చేపట్టకుండానే బలవంతంగా వక్ఫ్‌ బిల్లుకు ఆమోదం తెలిపారని విమర్శించారు. వివిధ శాఖలకు సంబంధించిన గ్రాంట్లు, ఆర్థిక బిల్లుకు కూడా లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో 16 బిల్లులు ఆమోదించబడ్డాయని ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ప్రక్రియ ముగినట్లు సభాపతి ప్రకటించారు.

వివిధ మంత్రిత్వ శాఖలకు గ్రాంట్ల డిమాండ్లకు, ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం బడ్జెట్ కసరత్తును పూర్తి చేసింది. కేంద్ర పాలనలో ఉన్న మణిపూర్‌ బడ్జెట్‌ కూడా ఆమోదం పొందింది. వివాదాస్పదమైన వక్ఫ్‌ సవరణ బిల్లును కూడా పార్లమెంట్‌ ఆమోదించుకుంది. కాగా, సోనియాగాంధీ వ్యాఖ్యలు దురదృష్టకరమని, సభ గౌరవానికి విరుద్ధమని అన్నారు. ఓం బిర్లా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు నినాదాలు చేపట్టారు. ఇక, లోక్‌సభ వాయిదా పడిన కొద్దిసేపటికే రాజ్యసభను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ 3న (గురువారం) ఉదయం 11 గంటల నుంచి వేకువజామున 4.02 వరకు సభను నిర్వహించామని, రాజ్యసభ చరిత్రలోనే ఇంత సుదీర్ఘ సమయం సభ నడవడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఇది దేశ ప్రజలకు గొప్ప సందేశాన్ని పంచుతుందన్న ఆయన.. పార్లమెంట్‌పై ప్రజలకు నమ్మకాన్ని పెంచుతుందని చెప్పారు. వక్ఫ్‌ (సవరణ) బిల్లుతోపాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. సభ ఉత్పాదకత 119 శాతంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

Read Also: HCU : జింకపై దాడి చేసిన కుక్కలు..జంతు ప్రేమికుల ఆవేదన