Site icon HashtagU Telugu

Telangana Politics: కాళేశ్వరం బాహుబలి మోటార్లు దొర లెక్కనే నిద్రపోతున్నయ్

Telangana Politics

New Web Story Copy 2023 07 11t152348.084

Telangana Politics: సీఎం కేసీఆర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేక విమర్శలకు నిలయంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీతి వాటిల్లిందంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజాగా వైస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల కాళేశ్వరం ప్రాజెక్ట్ దుస్థితిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాళేశ్వరం బాహుబలి మోటార్లు కెసిఆర్ లెక్కనే నిద్రపోతున్నాయి అంటూ హాట్ కామెంట్స్ చేశారు ఆమె.

దొర గారి డ్రీమ్డ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం దుస్థితి చూస్తుంటే ఊరు గొప్ప,పేరు దిబ్బ లెక్కుంది అంటూ విమర్శించారు. కష్టమొస్తే విలువ తెలుస్తదని చెప్పిన మాటలకు, కష్టకాలంలో ప్రాజెక్ట్ చూపే ప్రతిభకు పొంతనే లేదని ఆరోపించారు ఆమె. ఎగువ నుంచి వరద నీరు పోటెత్తుతున్నా.. ఎత్తిపోయాల్సిన బాహుబలి మోటార్లు దొర లెక్కనే నిద్రపోతున్నయ్ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. వారంలో 21 టీఎంసీలు తోడాల్సిన కేసీఆర్ కీర్తి కిరీటం.. 4 TMCలకే చతికిలబడ్డదని విమర్శల వర్షం కురిపించారు. రోజుకు 3 TMCలు అని చెప్పిన ప్రాజెక్ట్ అసలు స్వరూపం అర TMC దాటలేదు. 17 మోటార్లకు పట్టుమని పది మోటార్లు కూడా నడుస్తలేవు. కాళేశ్వరానికి అన్ని తానై కట్టిన దొర అండ్ మెగా ఇంజినీర్ పనితనం మూన్నాళ్ల ముచ్చటే. వర్షాలు లేకున్నా కోటి ఎకరాల మాగాణికి సాగునీరు అని చెప్పి..నార్లు పోసేందుకు చుక్క నీరు అందకపాయే అంటూ సెటైర్స్ పేల్చారు.

లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి, తెలంగాణను అప్పుల కుప్ప చేసి.. ఇదేనా దొర నువ్వు సాధించిన జలకళ అని ప్రశ్నించారు షర్మిల. కాళేశ్వరం తెలంగాణకు జలజాతర కాదు. రాష్ట్రం నెత్తిన గుదిబండ. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్ర సొమ్మును ఆరగించే వైట్ ఎలిఫెంట్ అయితే.. ప్రాజెక్ట్ పేరు చెప్పి ఖజానాను పీల్చిన జలగ కేసీఆర్. రూ.1.51 లక్షల కోట్లు పెట్టి లక్ష ఎకరాలను కూడా తడపలేదు. విద్యుత్ ఉత్పత్తిలో సగం కరెంట్ వాడి ఏ ప్రాజెక్టు నింపలేదు. నికరంగా ఎకరాకు రూ.6 లక్షలు ఖర్చు పెట్టినా.. కనీసం రైతుకు లక్ష ప్రయోజనం కూడా దక్కలేదు. ఒక్క తడికైనా సాగునీరు పారాలంటే ఎకరాకు అయ్యే ఖర్చు అక్షరాల రూ.46 వేలు. రైతు పండించే పంటకు వచ్చే లాభం కన్నా… దొర కాళేశ్వరంపై పెట్టే ఖర్చే తడిసిపోపెడు అవుతుందని చెప్పారు. రాష్ట్ర సంపదకు కాళేశ్వరం చిల్లులు పెడుతుంటే, దొర ఖజానాలో కాసులు గలగలమంటున్నయ్ అంటూ విమర్శలు చేశారు షర్మిల.

Read More: Kodali Nani: కొడాలికి క్యాన్సర్.. అసత్య వార్తలను ఖండించిన వైసీపీ ఫైర్ బ్రాండ్!