తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా అవసరాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. మొత్తం 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నియామక ప్రక్రియను వేరే ఏ బోర్డుకు అప్పగించకుండా.. ఆర్టీసీ యాజమాన్యమే నేరుగా చేపట్టనుంది. ప్రభుత్వ అనుమతి ఉత్తర్వులు చేతికందడంతో నోటిఫికేషన్ విడుదల, నియామక మార్గదర్శకాలపై ఆర్టీసీ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీజీఎస్‌ఆర్టీసీ ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటి వరకు సంస్థలో కండక్టర్ పోస్టుల భర్తీ కోసం ఎలాంటి అధికారిక రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. ప్రతి ఏటా వందలాది మంది రెగ్యులర్ ఉద్యోగులు పదవీ విరమణ పొందుతుండటంతో డిపోల్లో ఖాళీల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది. ఈ కొరతను అధిగమించడానికి కొంతకాలం క్రితం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు వివిధ రీజియన్ల పరిధిలోని డిపోల్లో తాత్కాలికంగా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించి బస్సులను నడిపారు. అయితే ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన 1,500 పోస్టుల భర్తీకి అనుమతి రావడంతో సంస్థలో కొత్త ఉత్సాహం నెలకొంది.
ఆర్టీసీ నిబంధనల ప్రకారం.. కండక్టర్ పోస్టుల ఎంపికకు రాత పరీక్షలు ఉండవు. సాధారణంగా పదో తరగతిలో వచ్చిన మార్కుల శాతాన్ని ప్రాధాన్యతగా తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రీజియన్ల వారీగా ఉన్న ఖాళీలు, ప్రభుత్వ రిజర్వేషన్ల రోస్టర్ పాయింట్లను పరిగణనలోకి తీసుకుంటూ ఈ నియామక ప్రక్రియ నిర్వహిస్తారు. అయితే ఈసారి ఎంపిక విధానంలో ఒక సాంకేతిక చిక్కు వచ్చి పడింది.
గతంలో పదో తరగతి పరీక్షల్లో మార్కుల శాతం విధానం ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వం గ్రేడింగ్ (జీపీఏ) విధానాన్ని ప్రవేశపెట్టింది. మళ్లీ ఇప్పుడు గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి మార్కుల శాతాన్ని పునరుద్ధరించారు. దీనివల్ల ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో కొందరి సర్టిఫికేట్లలో మార్కుల శాతం, మరికొందరి సర్టిఫికేట్లలో గ్రేడ్ పాయింట్లు ఉన్నాయి. ఈ రెండు భిన్నమైన విద్యా విధానాల అభ్యర్థులను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తెచ్చి, మెరిట్ జాబితా ఎలా రూపొందించాలనే అంశంపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పాత గ్రేడింగ్ విధానాన్ని ప్రస్తుత మార్కుల శాతంలోకి ఎలా కన్వర్ట్ చేసి లెక్కించాలనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ యాజమాన్యం తాజాగా ఎస్ఎస్‌సీ బోర్డుకు అధికారికంగా లేఖ రాసింది. బోర్డు నుంచి తుది వివరణ రాగానే సాంకేతిక ఇబ్బందులు తొలగిపోతాయని.. ఆ వెంటనే కండక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.
