Site icon HashtagU Telugu

BRS Silver Jubilee : ‘రజతోత్సవ’ సభ గేమ్ ఛేంజర్ కానుందా?

Brs Silver Jubilee Meeting Kcr Ktr Telangana Warangal Brs Meeting

BRS Silver Jubilee  : భారీ బహిరంగసభలు టిఆర్ఎస్ కు పేటెంటు.అయితే అది గత వైభవం.తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడినపుడు ఎక్కడ సభలు పెట్టినా ‘జన సముద్రాలు’ కనిపించేవి.ఉద్యమపార్టీ అధికారపార్టీగా మారిన తర్వాతే పరిస్థితులు మారాయి.పార్టీలోకి విచక్షణారహితంగా ప్రోత్సహించిన ‘ఫిరాయింపుల’మూలంగా ‘నకిలీలు’ వచ్చి చేరారు.అవకాశవాద రాజకీయాలు పెరిగాయి.’తాలు’ బాగా పెరిగింది.ప్రజలు ఆశించిన దానికి భిన్నంగా ‘దోపిడీ’ సాగిందన్న నిందలున్నవి.కేసీఆర్ కుటుంబం ప్రజాధనాన్ని,భూములు,ఆస్తులను కొల్లగొట్టారని ఆరోపణలున్నవి.

Also Read :Mahesh Babu: యాడ్స్‌తో మహేశ్‌బాబు సంపాదన ఎంతో తెలుసా ?

టిఆర్ఎస్/బిఆర్ఎస్ పాతికేండ్ల బహిరంగసభ రాష్ట్ర రాజకీయాల్లో ‘గేమ్ ఛేంజర్’ కానున్నట్టు కేసీఆర్ భావన.కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అయ్యారు.ఆయన కదన కుతూహలంతో ఉన్నారు.ఎల్కతుర్తి సభ ద్వారా ఆయన తెలంగాణ సమాజానికి ఇవ్వదలచుకున్న సందేశం ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది.బహిరంగసభ జనసమీకరణ కోసం తన ఫార్మ్ హౌజ్ లో జిల్లాలవారీగా జరుపుతున్న ‘సన్నాహక’ సమావేశాల్లో పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపుతున్నారు.ఉరిమే ఉత్సాహం అధినేతలో కనిపిస్తున్నట్టు కార్యకర్తలు చెబుతున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంపైనా,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా కేసీఆర్ సిల్వర్ జూబిలీ సభలో పెద్దఎత్తున విరుచుకు పడనున్నారు.’ప్రసంగ కళ’లో ఆరితేరిన వ్యక్తి కేసీఆర్.తన ‘కంఠం’తోనే ఆయన పదమూడేండ్ల పాటు ఉద్యమాన్ని,పదేండ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపారు.అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంటు ఎన్నికలలో,ఆ తర్వాత మరికొన్ని సందర్భాలలో సభల్లో మాట్లాడారు.ఆయా సభలన్నీ ఒక ఎత్తు.ఎల్కతుర్తి సభ మరో ఎత్తు.రాష్ట్ర రాజకీయాల్లో ‘పెను ప్రకంపనల’కు ఈ సభ శ్రీకారం చుడుతుందని బిఆర్ఎస్ నాయకుల అభిప్రాయం.అందువల్ల కేసీఆర్ సభపై ప్రజల్లో,రాజకీయ వర్గాలలోనూ ఆసక్తి పెరుగుతోంది.

రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని సభ నడిపితే కేసీఆర్ కు(BRS Silver Jubilee),బిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని పరిశీలకులంటున్నారు. .”మళ్ళీ అధికారం మాదే” అనే నినాదం ఆకర్షణ కోల్పోయింది.ఇందుక్కారణం ఎన్నికలు జరగడానికి మరో మూడున్నరేండ్ల వ్యవధి ఉన్నది.ఈ లోగా అనూహ్యమైన రాజకీయయ పరిణామాలు చోటు చేసుకొని,రేవంత్ ప్రభుత్వం కూలిపోయి, ‘మధ్యంతర’ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు.రేవంత్ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగదన్నది బిఆర్ఎస్ నాయకుల ఊహ.కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలన్నది వారి ఆశ.కేసీఆర్ ఫార్మ్ హౌజ్ నుంచి ‘జన జీవన స్రవంతి’ లోకి రావడం పార్టీ శ్రేణులకు మంచి ‘కిక్కు’ నిచ్చే అంశం.’సిల్వర్ జూబిలీ’ సభ తెలంగాణ రాజకీయాలను శాసిస్తుందని కానీ,మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని,ఈ సభ ‘గేమ్ ఛేంజర్’ కానుందని ఎవరూ అనుకోవడం లేదు.

కేసీఆర్ చాలా రోజుల తర్వాత ప్రజల్లోకి వస్తున్నందున ఆయన ఎటువంటి సందేశం ఇవ్వనున్నారన్నది ఆసక్తి కలిగించేదే! అదే సమయంలో,ఆయన తమ హయాంలో జరిగిన తప్పిదాలు,లోటు పాట్లు,ప్రజల నుంచి తాము ఎందుకు దూరమయ్యామో,ప్రజలు తమకు ఎందుకు దూరమయ్యారో కేసీఆర్ వివరణ ఇవ్వవలసి ఉన్నది.”మమ్మల్ని అధికారానికి దూరం చేసి ఏమి కోల్పోయారో ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది” అంటూ బిఆర్ఎస్ అధినేత మాట్లాడితే స్వాగతించే పరిస్థితిలో సామాన్య ప్రజలు లేరు.

Also Read :NTR Statue: ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’లా అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం

ముందుగా అసలు బిఆర్ఎస్ జాతీయ పార్టీయా,ప్రాంతీయ పార్టీయా అన్నది కేసీఆర్ స్పష్టం చేయవలసి ఉంటుంది.పదేండ్ల కాలంలో దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేయవలసి వచ్చిందో,రైతు భరోసా తదితర పథకాల రూపంలో వేల కోట్ల రూపాయలను పుట్నాల వలె ఎందుకు పంచవలసి వచ్చిందో,ధనిక రాష్ట్రం పదేండ్ల వ్యవధిలోనే అప్పుల ఊబిలో కూరుకుపోయిందో ఆయన జవాబు చెబుతారా ? లేదా ? తెలియదు.’ధరణి’ పేరిట జరిగిన ‘భూ దోపిడీ’,లక్షలాది ఎకరాల గుటకాయ స్వాహా,కాళేశ్వరం అక్రమాలు,ఫార్ములా ఈ రేసు,విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గోల్ మాల్,అన్నింటికీ మించి ఫోన్ ట్యాపింగ్ వంటి నేరాలపై కేసీఆర్ ‘వాంగ్మూలం’ ఏమిటో సస్పెన్సుగా ఉన్నది.తాము మరలా అధికారంలోకి వస్తే ‘గడీ’ పాలన ఉండదనీ,ఫార్మ్ హౌస్ నుంచి పరిపాలించబోమని చెప్పడానికి కేసీఆర్ సాహసించగలరా? ప్రగతిభవన్ ఖాళీ చేసినప్పుడు,దానికి రక్షణగా ఉన్న ‘ఇనుప ముళ్ల కంచెలు’ తొలగించినపుడు కేసీఆర్ ఎంతగా విలవిలలాడిపోయి ఉంటారో అంచనా వేయవచ్చు.

అధికారం కోల్పోయిన నాటి నుంచి బిఆర్ఎస్ పార్టీలో నిస్తేజం అలుముకున్న మాట నిజం.పైగా పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు.సాంకేతికంగా వాళ్ళు ఇంకా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు.అది వేరే చర్చ.వారిపై అనర్హత వేటు వేయాలంటూ బిఆర్ఎస్ సుప్రీంకోర్టులో పోరాడుతోంది.అక్కడ వాళ్ళు సంతృప్తికరంగా ఉన్నారా?లేదా? అన్న విషయం వేరు.వాళ్ళతో మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా ‘ఫిరాయించే’ సంకేతాలు అందగానే హుటాహుటిన బిఆర్ఎస్ లోనే కొనసాగే విధంగా ఫార్మ్ హౌజ్ లో ఒక ‘కథ’ నడిచినట్టు ప్రచారంలో ఉంది.పార్టీ ఫిరాయించిన వారిని మళ్ళీ తమ పార్టీలో చేర్చుకోబోమని కేసీఆర్ అంటున్నారు.

బిఆర్ఎస్ లోకి మళ్ళీ వెళ్లినా వచ్చే ఎన్నికల్లో టికెట్టు ఇవ్వరని బిఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడానికి గాను ప్రస్తుతానికి తమ ఎపిసోడ్ ను వాడుకొని తర్వాత ‘కరివేపాకు’ వలె తీసి పారవేయడంలో కేసీఆర్ దిట్ట అని వారు భావిస్తున్నట్టు తెలియవచ్చింది.పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలంటూ బిఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.ఇక అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎలాంటి తీర్పునిస్తారో,ఎప్పుడు తీర్పు వెలువడుతుందో ఎవరికీ అంతు చిక్కని సంగతి.ఈ నేపథ్యంలో తాము రెంటికి చెడ్డ రేవడిలా మారకుండా ఉండడానికి గాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమే బెటర్ అని పార్టీ మారిన శాసనసభ్యుల అంతరంగమని తెలియవచ్చింది.

తెలంగాణ సెంటిమెంటు ‘కాలం చెల్లిన ఔషధం’.స్వరాష్ట్రమే సాకారమయ్యాక ఇన్ని సంవత్సరాల తర్వాత అలనాటి ‘ప్రత్యేక భావోద్వేగాలు’ రగిలించినా పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. కనుక తమ పాలనలో జరిగిన సంక్షేమం,అభివృద్ధి వంటి అంశాలపైనే కేసీఆర్ ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నవి.పార్టీ క్యాడర్ ను అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర ఏండ్లలో బిఆర్ఎస్ నాయకత్వం ఖాతరు చేసిందా?వారి బాగోగులు ఎప్పుడయినా పార్టీ నాయకత్వం పట్టించుకుందా? ‘పార్టీ అంటే మేమే,మేమే పార్టీ’ అనే వైఖరితో కేసీఆర్,కేటీఆర్ ప్రవర్తించిన కారణంగా పార్టీ కింది స్థాయి శ్రేణులన్నీ భగభగ మండిపోయాయి.’కుటుంబ పాలన’ కు వ్యతిరేకంగానే ప్రజలు తీర్పు ఇచ్చారు.అయినా బిఆర్ఎస్ నాయకత్వంలో ‘అహంకార’ ప్రదర్శన తగ్గుముఖం పట్టడం లేదు.

“పరిపాలనపై దృష్టి సారించడం ద్వారా మేము మా పార్టీ వ్యవహారాలను విస్మరించాం” అనే వాస్తవ లోకంలోకి రావడానికి బిఆర్ఎస్ నాయకులకు,మరీ ముఖ్యంగా తండ్రీ,కొడుకులకు ‘ఇగో’ అడ్డం వస్తుండవచ్చు.కానీ అది నిజం.అదే నిజం.పార్టీని నిర్లక్ష్యం చేయడమన్నది 2024 నుంచే మొదలు కాలేదు.2001 నుంచి కూడా కేసీఆర్ ‘ఒంటెత్తు పోకడ’లతోనే పార్టీని నడిపారు.ఉవ్వెత్తున ఎగసిన ‘ఉద్యమ తుపాను’లో కేసీఆర్ పొరబాట్లు,తప్పులు కొట్టుకుపోయాయి.ఉద్యమం ‘పై చేయి’ సాధించిన సందర్భాలలో సహజంగానే రాజకీయపార్టీ కార్యకలాపాల్లోని లోటుపాట్లు ఎవరికీ కనిపించవు.మన ఫోకస్ మొత్తం ఉద్యమ కార్యాచరణపైన ఉంటుంది కనుక కేసీఆర్ నాయకత్వ లోపాలేవీ కాన రాలేదు.

ఏ పార్టీలోనయినా అత్యంత ముఖ్యమైన సంస్థాగత నిర్మాణం టిఆర్ఎస్/బిఆర్ఎస్ లో మొదటినుంచీ లేదు.గ్రామస్థాయి నుంచి తెలంగాణ భవన్ కు సమగ్ర సమాచార పంపిణీ వ్యవస్థ లేదు.నిస్పాక్షిక విశ్లేషణలు,నివేదికలు కేసీఆర్,కేటీఆర్ కు చేరే అవకాశాలు లేవు.ఒకవేళ చేరినా ఆయా సమాచారాన్ని వాళ్లిద్దరూ అలక్ష్యం చేసే రకం.తమకు తెలిసిన దానికన్నా ఇంకొకరికి ఎక్కువ విషయాలు,వాస్తవాలు తెలిసే చాన్సు లేదని కేసీఆర్ నమ్ముతుంటారు.బిఆర్ఎస్ పార్టీ అస్తిత్వ ముప్పును ఎదుర్కుంటున్నట్టు స్వయంగా ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ పుంజుకోవడం బీఆర్ఎస్ ‘పుణ్యమే’నన్న విశ్లేషణ ఉన్నది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. BRS 39 స్థానాలకు పరిమితమైంది.2018 లో కేవలం ఒక సీటు మాత్రమే పొందిన BJP 14% ఓట్లతో 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడం తేలికగా తీసుకోవలసిన అంశం కాదు.బీజేపీ,కాంగ్రెస్ లను ఢీకొనడానికి గాను ‘ఢిల్లీ పార్టీలు’ అంటూ కేటీఆర్ ఒక ప్రచారం ప్రారంభించారు.తమది ప్రాంతీయ పార్టీ అని,హైదరాబాద్ తమ హెడ్ క్వార్టర్ అని ఆయన అంటున్నారు.