Group 1 : తెలంగాణలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలపై వివాదం రేగుతోంది. జీఓ నంబరు 29ని రద్దు చేయాలంటూ అభ్యర్థులు నిరసనలకు దిగుతున్నారు. ఇంతకుముందు వరకు అమలు చేసిన జీఓ నంబరు 55 ప్రకారమే మెయిన్స్ ఎగ్జామ్స్‌ను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఈ రెండు జీఓల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Lawrence Bishnoi : జైలులో లారెన్స్ బిష్ణోయ్.. సంవత్సరానికి రూ.40 లక్షల ఖర్చులు
జీఓ నంబర్ 29 ఏం చెబుతోంది ?
- జీఓ నంబరు 55ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 సంవత్సరంలో జారీ చేసింది.
- అయితే జీఓ నంబరు 55 ప్రకారం జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను కోర్టు తీర్పు ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది.
- పాత గ్రూప్-1 నోటిఫికేషన్ స్థానంలో కొత్త నోటిఫికేషన్‌ను సీఎం రేవంత్ సర్కారు జారీ చేసింది. ఇందుకోసం జీఓ నంబర్ 29ని ప్రాతిపదికగా తీసుకుంటామని వెల్లడించింది.
- జీఓ నంబరు 29 ప్రకారం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా గ్రూప్-1(Group 1) మెయిన్స్‌లో మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కేవలం ఉద్యోగాల కేటాయింపులో మాత్రమే రిజర్వేషన్లను వర్తింపజేస్తారు. జీఓ నంబరు 29లోని ఈ నిబంధనల వల్ల ఓపెన్ కేటగిరీలో ఎంపికైన రిజర్వుడు అభ్యర్థులను కూడా రిజర్వేషన్ కేటగిరీ కిందే పరిగణిస్తారు. ఫలితంగా రిజర్వుడ్ కేటగిరీలో ఉన్నవారికి అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
- తమ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. దీనిపై సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడుతాయో వేచిచూడాలి.
- జీఓ నంబర్ 29 ప్రకారం.. రిజర్వేషన్ ప్రకారం కాకుండా మల్టీజోన్ పోస్టుల సంఖ్యకు 50 రెట్ల మంది అభ్యర్థులను గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. ఇలా 50 రెట్ల మందిని ఎంపిక చేసినప్పుడు రిజర్వుడ్ కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య 1:50 నిష్పత్తి కంటే తక్కువగా ఉంటే.. తదుపరిగా మెరిట్ కలిగిన అభ్యర్థులను కూడా అదనంగా తీసుకుంటారు. తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీసు నిబంధనల్లోని రూల్ 22, 22ఏ ఆధారంగా వీరిని జాబ్స్‌కు ఎంపిక చేస్తారు. ఈ మేరకు జీవో 55లోని పార్ట్ ‘బి’లో మార్పులు చేసి జీవో 29ను తీసుకొచ్చారు.
- గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన జీఓ నంబర్ 55 ప్రకారం.. 1:50 నిష్పత్తిలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో 40 శాతం మంది అభ్యర్థులను మెరిట్ ప్రకారం, 60 శాతం మంది అభ్యర్థులను రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక చేస్తారు. మెరిట్ ఉన్న రిజర్వుడు అభ్యర్థులు ఓపెన్ కోటాలో ఎంపికవుతారు. మెరిట్ తక్కువ ఉన్న అభ్యర్థులకు రిజర్వుడు కేటగిరిలో ఛాన్స్ దక్కుతుంది. ఫలితంగా ఓపెన్ కోటా, రిజర్వుడు కోటా రెండింటిలోనూ రిజర్వేషన్లు ఉన్న అభ్యర్థులకు ప్రయోజనం లభిస్తుంది.