Kokapet Lands : హైదరాబాద్ నగరంలోని కోకాపేట కాస్తా బంగారుపేటగా మారింది. ఎందుకంటే అక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అక్కడి భూముల ధరల గురించి వింటే.. మనం ఫారిన్‌లో ఉన్నామా అనిపిస్తుంది. ఆకాశాన్ని తాకే భవనాలు, పెద్ద పెద్ద కంపెనీలతో కోకాపేట రూపురేఖలు మారడంతో ఈ బూమ్ వచ్చింది. అంతేకాదు.. హైదరాబాద్ నగరంలో ప్రధాన వ్యాపార కేంద్రంగా కోకాపేట అభివృద్ధి చెందుతోంది. ఈ ఏరియాలో ఐటీ కంపెనీలు, మల్టీ నేషనల్ కంపెనీలు వేగంగా పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ ప్రాజెక్టులను అంతే వేగంతో పెంచుతున్నాయి. కోకాపేటకు మంచి రోడ్డు మార్గాలు ఉండటం కూడా, ఇక్కడి భూముల ధరలు పెరగడానికి ప్రధాన కారణమవుతోంది.
Also Read :Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ.. ఇద్దరు ఔట్.. ఆరుగురు ఇన్ ?
ఇతర రాష్ట్రాల వ్యాపారులు సైతం..
ఇతర రాష్ట్రాల వ్యాపారులు, సంపన్నులు, కంపెనీల నిర్వాహకులు ఇక్కడ భూములు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరం భూమి ధర రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల దాకా ఉంది. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు ఉండటం అనేది కోకాపేటకు పెద్ద అడ్వాంటేజీ. ప్రధానంగా ఇంటర్ ఛేంజ్‌ల దగ్గర భూములకు ఎక్కువ డిమాండ్ ఉంది. కమర్షియల్ ల్యాండ్, రెసిడెన్షియల్ ప్లాట్, విల్లా ఈవిధంగా భూములను విభజించి అమ్ముతున్నారు. గతంలో పోలిస్తే ఇక్కడ ఎకరాకు సగటున రూ. 2 కోట్ల దాకా భూముల ధరలు పెరిగాయి.
Also Read :Feet : మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే జాగ్రత్త!
కోకాపేట వద్ద ట్రంపెట్ జంక్షన్
రూ.60 కోట్ల వ్యయంతో ఔటర్ రింగు రోడ్డుపై కోకాపేట వద్ద ట్రంపెట్ జంక్షన్‌ను(Kokapet Lands) నిర్మించారు. దీని వల్ల ఓఆర్‌ఆర్ నుంచి నేరుగా నియో పొలిస్ లేఅవుట్‌లోకి వాహనాలు వెళ్తాయి. కోకాపేటలో 500 ఎకరాల్లో నియో పొలిస్ పేరుతో హెచ్‌ఎండీఏ భారీ లేఅవుట్ వేసింది. ఇందులో భూముల ధర గరిష్ఠంగా ఎకరం రూ.100 కోట్లు పలికింది. అందుకు తగ్గట్టుగా మౌలిక వసతుల కల్పన కోసం హెచ్‌ఎండీఏ భారీగా డబ్బులు ఖర్చు చేస్తోంది. రియల్ ఎస్టేట్ కంపెనీలు సైతం గృహ, కార్యాలయాల ప్రాజెక్ట్‌లను 50 నుంచి 60 అంతస్తుల దాకా నిర్మిస్తున్నాయి. ఇవన్నీ పూర్తయితే దాదాపు 5 లక్షల మంది కోకాపేట ప్రాంతం నుంచి పనిచేసే అవకాశం ఉంటుంది. ఇంత ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా కోకాపేటకు ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం లేకపోతే ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ట్రంపెట్‌ను నిర్మించారు.