Site icon HashtagU Telugu

Where is KCR : కేసీఆర్ ఎక్కడ ? గులాబీ బాస్ ‘హైడ్ అండ్ సీక్’.. కేటీఆర్ చేతిలో ‘కారు’ స్టీరింగ్

Where Is Kcr Brs Ktr Harish Rao Telangana Revanth Reddy Congress

Where is KCR :  కేసీఆర్.. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పిన రాజకీయ యోధుడు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేతగా తెలంగాణ రాజకీయాలను శాసించిన ఈ నేత ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు కనిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్‌ ‘కారు’ను ముందుకు నడిపించే బాధ్యతను కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తీసుకున్నారు. ఆయన తనదైన శైలిలో పార్టీ శ్రేణులను ముందుకు నడిపిస్తున్నారు.

Also Read :Congress Manifesto : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో.. నిరుద్యోగులు, మహిళలకు కీలక హామీలు

కేటీఆర్: బీఆర్ఎస్ కొత్త ముఖం

కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్‌గా లేని ప్రస్తుత తరుణంలో బీఆర్ఎస్‌లో కేటీఆర్ నాయకత్వ పటిమతో చొరవ చూపి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శనాత్మకంగా ఎదుర్కొంటున్నారు. ఇటీవలే నల్గొండలో నిర్వహించిన ‘రైతు మహా ధర్నా’లో కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులను కాంగ్రెస్ సర్కారు ఆదుకోవడం లేదన్నారు. రైతు బంధు పథకం నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో ఆర్థిక సాయం హామీలతో రైతుల ఓట్లు పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఓ వైపు బీఆర్ఎస్ నిరసనలు, ర్యాలీలను కేటీఆర్ ముందుండి నడుపుతుంటే.. మరోవైపు కేసీఆర్ మాత్రం పార్టీ కార్యకలాపాలకు దూరంగా, మౌనంగా ఉండిపోవడం గమనార్హం.

కేసీఆర్ అదృశ్య మాయాజాలం

కేసీఆర్(Where is KCR) ఎక్కడ? ఇది తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయికి సరిపోడనే భావనతోనే కేసీఆర్ రాజకీయాల్లో సైలెంట్‌గా ఉండిపోయారని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ కేసీఆర్ ఈ విధమైన ఆలోచన చేసి ఉంటే అది సరికాదని అంటున్నారు. కుమారుడు కేటీఆర్‌ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించే క్రమంలోనే కేసీఆర్ ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారని ఇంకొందరు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కేటీఆర్ యాక్టివిటీని కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల బీఆర్ఎస్ సమావేశాల్లో పార్టీ కార్యకర్తలు “సీఎం కేటీఆర్” అంటూ నినాదాలు చేశారు. ఇదంతా చూస్తుంటే, పార్టీలో నాయకత్వ మార్పిడి కోసం కేసీఆర్ పన్నిన వ్యూహంలాగే కనిపిస్తోంది.

Also Read :Maha Kumbh Stampede : డస్ట్ బిన్స్ వల్లే తొక్కిసలాట.. మహాకుంభ మేళాలోని ప్రత్యక్ష సాక్షులు

భయానికి కారణం : కేసీఆర్‌పై ఉన్న కేసులే

కేసీఆర్ కనిపించకుండా పోవడానికి గల మరో పెద్ద కారణం ‘కేసులు’ కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్, విద్యుత్ ఒప్పందాలపై విచారణను ప్రారంభించింది. మరోవైపు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. ఆమెపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో కేటీఆర్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్వయంగా బయటకు వచ్చి సమస్యలను మరింత పెంచుకోవాలని అనుకోవడం లేదని పలువురు పరిశీలకులు అంటున్నారు.

డబ్బు లేకే కేసీఆర్ సైలెంట్?

కేసీఆర్ ఆర్థిక కారణాల వల్లే బయటకు రాకూడదనే నిర్ణయం తీసుకున్నారా? బీఆర్ఎస్ శక్తివంతంగా ఉండాలంటే పెద్దఎత్తున సభలు, ర్యాలీలను నిర్వహించాలి. అయితే పార్టీ అధికారంలో లేని ప్రస్తుత పరిస్థిత్తుల్లో ఇవన్నీ చేయడానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరం. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న నిధులను ప్రస్తుత తరుణంలో వినియోగించడానికి కల్వకుంట్ల కుటుంబం సిద్ధపడకపోవచ్చు. ఈ ఆర్థిక ప్రతికూలతల వల్లే కేసీఆర్ సైలెంట్ అయ్యారని అంటున్నారు. దాదాపు పదేళ్ల పాటు తెలంగాణను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కేసీఆర్ ఇక శాశ్వతంగా ఇలాగే మౌనంగా ఉండిపోతారా ?

విపక్ష నాయకుడా ? మొహం చాటేసిన నాయకుడా?

కేసీఆర్ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. ఆయనొక ఎమ్మెల్యే. విపక్ష పార్టీ నేత. మౌనంగా ఉండటం వల్ల కేసీఆర్‌కు మేలు జరగకపోగా, రాజకీయంగా చెడు జరిగే అవకాశాలు ఉంటాయి. రాజకీయ వైఖరిని ప్రజల ఎదుట వ్యక్తం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. కాంగ్రెస్‌కు కేసీఆర్ సవాల్ విసరాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ మళ్లీ పోరాడి, ముందంజలో నిలవాలని ప్రజానీకం ఆశిస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్ తెరమరుగు అయ్యారు. ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు మాత్రమే బీఆర్ఎస్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.

సమయం కోసం వేచి చూస్తున్నారా ? తలనొప్పి తప్పించుకుంటున్నారా?

బీఆర్ఎస్ నేతలంతా ఒకే మాట చెబుతున్నారు. రాజకీయాల్లో సరైన సమయం కోసం కేసీఆర్ ఎదురు చూస్తున్నారని వారు అంటున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలు అర్థం చేసుకొని, కళ్లారా చూసిన తర్వాతే జనక్షేత్రంలోకి దూకాలని కేసీఆర్ అనుకుంటున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే అప్పటిదాకా ప్రజలు కేసీఆర్ కోసం ఎదురు చూస్తారా ? అనేది పెద్ద ప్రశ్న. 2018 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌తో కేసీఆర్ గెలిచారు. 2023 ఎన్నికల్లో సెంటిమెంట్ పనిచేయలేదు. అప్పటి బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై ఏర్పడిన ప్రజా వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, బలమైన విపక్షం వంటి అంశాలు ప్రజలను ఆలోచింపజేశాయి. వెరసి, బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది. ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది.

ఇదే సమయంలో కేసీఆర్‌పై సీఎం రేవంత్ విమర్శల వాడిని పెంచుతున్నారు. కేసీఆర్, ఆయన కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇకనైనా కేసీఆర్ బయటకు వస్తారా? లేక తన ఫాంహౌస్‌లోనే కూర్చొని రాజకీయాలను దూరం నుంచే చూస్తూ ఉండిపోతారా?

ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో నిశ్శబ్దం అంటే రాజకీయ జీవితానికి ముగింపు. కేసీఆర్ ఇకపై కూడా మౌనంగా ఉంటే, తెలంగాణ ప్రజలు ఆయనను మరచిపోయారా అనే ప్రశ్న తలెత్తుతుంది.