SLBC Tunnel: ఏమిటీ ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ? 20 ఏళ్లుగా ఎందుకు నిర్మిస్తున్నారు ?

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్టు పనులను రూ.2813 కోట్లతో చేపట్టేందుకు 2005 ఆగస్టులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 

Published By: HashtagU Telugu Desk
Slbc Tunnel Srisailam Left Bank Canal Telangana Nalgonda District

SLBC Tunnel: ఎస్ఎల్‌బీసీ సొరంగం(టన్నెల్) గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఎస్‌ఎల్‌బీసీ అంటే శ్రీశైలం ఎడమగట్టు కాల్వ.  దీనికి సంబంధించిన సొరంగ మార్గంలో తాజాగా ప్రమాదం జరిగింది. అందులో 8 మంది చిక్కుకుపోయారు. ఇంకా రెస్క్యూ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్ఎల్‌బీసీ సొరంగం నిర్మాణానికి 42 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే నిధులు మాత్రం 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యాయి. వాటితో పనులు మొదలుపెట్టారు. గత మూడేళ్లుగా ఈ పనులు ఆగాయని, ఈ మధ్యే మళ్లీ మొదలయ్యాయని తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు అంటున్నారు.  అసలు ఏమిటీ సొరంగం ? ఎందుకు తవ్వుతున్నారు? ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Driving License : ఇంట్లో నుంచే డ్రైవింగ్  లైసెన్స్.. షోరూం నుంచే వాహన రిజిస్ట్రేషన్

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఎందుకు ?

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్టు పనులను రూ.2813 కోట్లతో చేపట్టేందుకు 2005 ఆగస్టులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.  ఈ ప్రాజెక్టుకు నాటి సీఎం వైఎస్  రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. 2007లో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 30 టీఎంసీల నీటిని కృష్ణా నది నుంచి తరలించాలనేది ప్లాన్. దీనిద్వారా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించాలని యోచించారు. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం. అక్కడ ఓపెన్‌గా కాలువను తవ్వి పనులు చేసేందుకు అనుమతులు లభించే పరిస్థితి లేదు. అందుకే టన్నెల్స్ నిర్మించి, గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలని భావించారు. 2010 నాటికే ఈ ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేయాలనేది ప్రణాళిక. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోనే  52 శాతం పనులు పూర్తయ్యాయి. గత పదేళ్లలో మరో 23 శాతం పనులు జరిగాయి.  ఇప్పటివరకు ఆరు సార్లు ఈ  ప్రాజెక్టు పూర్తికి గడువులు పెంచారు. ప్రస్తుతం 2026 జూన్‌లోగా ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.

Also Read :Chiranjeevi : ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లో మెగాస్టార్ సందడి.. తిలక్ వర్మ, అభిషేక్ శర్మలతో కలిసి..

రెండు సొరంగాల లెక్క ఇదీ

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టులో భాగంగా 43.93 కిలోమీటర్ల  మేర మొదటి సొరంగాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 34.37 కిలోమీటర్ల మేర పనులు పూర్తయినట్లు తెలిసింది. ఈ టన్నెల్‌కు సంబంధించిన రెండు వైపుల నుంచి ఇన్‌లెట్(లోపలికి నీరు ప్రవేశించే భాగం), అవుట్‌లెట్ (బయటికి నీరు వెళ్లే భాగం) పనులు పూర్తి చేశారు. ఇంకా 9.56 కిలోమీటర్ల మేర ఈ  టన్నెల్‌ను నిర్మించాల్సి ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నెవారి పల్లి వద్ద టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. రెండో టన్నెల్‌కు సంబంధించిన 7.13 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇది నల్లగొండ జిల్లా చందంపేట మండల తెల్‌దేవరపల్లి నుంచి నేరెడుగొమ్మ వరకు ఉంది. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లిపాకాల, ఉదయ సముద్రం రిజర్వాయర్ పరిధిలో ఈ రెండో టన్నెల్‌ను ఇంకా నిర్మించాల్సి ఉంది.

  Last Updated: 24 Feb 2025, 08:32 AM IST