42 Percent Reservation: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే (42 Percent Reservation) జరుగుతాయని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చారిత్రక నిర్ణయం తీసుకుందని, దీనిపై కోర్టులో ప్రభుత్వ వాదనలు బలంగా వినిపించామని ఆయన తెలిపారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ ఎన్నికలకు వెళ్తున్న దేశంలో తొలి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ప్రకటించారు. ఇది బలహీన వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో భాగంగా తీసుకున్న గొప్ప నిర్ణయంగా ఆయన అభివర్ణించారు.
సభలో మద్దతు, కోర్టులో ఇంప్లీడ్ అవ్వాలి
ఈ రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చల గురించి మంత్రి గుర్తు చేస్తూ.. సభలో ఈ అంశంపై ఏకగ్రీవ తీర్మానం జరిగిందని చెప్పారు. “సభలో నేను మాట్లాడినప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ (బీఆర్‌ఎస్) స్పష్టంగా మద్దతు ఇచ్చారు” అని మంత్రి వెల్లడించారు. “బలహీన వర్గాల సామాజిక న్యాయం అమలు దృష్ట్యా రాజకీయాలకు పోకుండా పార్టీలన్నీ ఐక్యంగా ఉండాలి” అని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
Also Read: Curry Leaves: 30 రోజుల్లో మీ జుట్టు పెరగాలంటే.. కరివేపాకును ఉపయోగించండిలా!
అసెంబ్లీలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టే కోర్టులో కూడా ఈ 42 శాతం రిజర్వేషన్ల చట్టానికి అనుకూలంగా బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు ఇంప్లీడ్ కావాలని ఆయన కోరారు. “కోర్టులో కేవలం అఫిడవిట్‌లు మాత్రమే సరిపోవు. అన్ని పార్టీల మద్దతు అవసరం” అని ఆయన పేర్కొన్నారు.
ఎంపైరికల్ డేటా ఆధారంగానే చట్టం
ఈ రిజర్వేషన్ల పెంపునకు ఆధారం గురించి మంత్రి వివరిస్తూ.. “ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వేలో మీరు (విపక్షాలు) పాల్గొనలేదు. అయినప్పటికీ ప్రజలు 97 శాతం మంది ఈ సర్వేలో పాల్గొన్నారు” అని తెలిపారు. “ఎంపైరికల్ డేటాకు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ వేసి, ఆపై సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని, 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసుకున్నాం. ఇది పకడ్బందీగా జరిగింది. బీసీలకు న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వం పోరాడుతుంది” అని మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టిగా చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ తాజా నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.
