Bathukamma Sarees : ప్రజా ప్రభుత్వంలో బతుకమ్మ చీరను బంద్ పెట్టారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీష్‌రావు చేసిన విమర్శలను మంత్రి సీతక్క ఖండించారు. నాసిరకం చీరలను ఇవ్వడం ద్వారా తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ కించపర్చిందన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు బతుకమ్మ చీరలను మించిన ఆర్థిక ప్రయోజనాలను ప్రతినెలా అందిస్తోందని సీతక్క గుర్తు చేశారు. ‘‘బతుకమ్మ చీరల పంపిణీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా రూ.300 కోట్లే ఖర్చు చేసింది. మేం మహిళలకు ఆర్థిక స్వేచ్చను కల్పించేందుకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. మా ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడినప్పటి నుంచి మహిళల ఉచిత బస్సు ప్రయాణ స్కీంపై రూ. 3,325 కోట్లు ఖర్చు చేశాం. సగటున నెలకు రూ. 332 కోట్లను ఆడబిడ్డలకు ఆదా చేశాం. బతుకమ్మ చీరల కొనుగోలుకు బీఆర్ఎస్ వాళ్లు వెచ్చించిన బడ్జెట్ కంటే.. దాదాపు పదిరెట్లు ఎక్కువ బడ్జెట్‌నే ఉచిత బస్సు ప్రయాణ స్కీంకు ఖర్చుపెట్టాం’’ అని మంత్రి సీతక్క వివరించారు.
Also Read :Sheikh Hasina : షేక్ హసీనాపై బంగ్లాదేశ్ అరెస్టు వారెంట్.. భారత్ ఏం చేయబోతోంది ?
‘‘మేం మహిళల వంటింటి భారం తగ్గించేందుకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్‌ను(Bathukamma Sarees) అందిస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 1200. ఈవిధంగా సిలిండర్ ధరను తగ్గించేందుకు మేం ఇప్పటికే రూ.300 కోట్లకుపైగా ఖర్చు చేశాం’’ అని మంత్రి సీతక్క తెలిపారు. ‘‘200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ పథకం కింద దాదాపు రూ.1000 కోట్లను మేం ఖర్చు చేశాం. మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబన కోసం బ్యాంకులకు రూ.400 కోట్ల వడ్డీని మా ప్రభుత్వమే చెల్లించింది. మరో రూ.1000 కోట్లను చెల్లించేందుకు కూడా రెడీ ఉన్నాం’’ అని ఆమె వెల్లడించారు. ‘‘మహిళల గౌరవాన్ని మేం నిలబెట్టాం. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మేం ప్రయత్నాలు చేస్తున్నాం. పథకాలు అమలు చేస్తున్నాం. ఎన్నికల హామీలను తు.చ తప్పకుండా అమలు చేస్తున్న ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుంది’’ అని సీతక్క చెప్పారు.