Site icon HashtagU Telugu

Hydraa : ప్రభుత్వం కట్టడాలు నిర్మించాల్సిందీపోయి.. కూల్చేయడం ఏంటి..? – కిషన్ రెడ్డి లేఖ

Kishan Reddy Letter Cm

Kishan Reddy Letter Cm

హైడ్రా (Hydraa) కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి కి , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) బహిరంగ లేఖ రాసారు. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. చెరువులు, బఫర్ జోన్స్, ఎఫ్ టీఎల్, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తుంది హైడ్రా. నిబంధనలకు విరుద్దంగా స్థలాలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను బుల్డోజర్లతో పడగొడుతున్నది. హైడ్రా చర్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. అయితే హైడ్రా కూల్చివేతలకు మొదట్లో పలు వర్గాల నుంచి మద్దతు లభించినప్పటికీ..ప్రస్తుతం మాత్రం పూర్తి వ్యతిరేకత వస్తుంది.

పొలిటికల్ లీడర్స్ , సంపన్నులకు నోటీసులు ఇస్తూ..ఖాళీ చేసేందుకు టైం ఇస్తున్న హైడ్రా..సామాన్య ప్రజల వద్దకు వచ్చేసరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తుందని..కనీసం ఇంట్లో సామాన్లు తీసుకెళ్తామన్న కూడా కుదరదంటూ కూల్చేస్తూ తమను రోడ్డు మీదకు లాగుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఇటు విపక్షాలు సైతం హైడ్రా చర్యల వల్ల హైదరాబాద్ అంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని..పెట్టుబడులే కాదు రియల్ ఎస్టేట్ రంగం కూడా పూర్తిగా తగ్గిపోయిందని..హైదరాబాద్ (Hyderabad) నగరంలో నివసించాలన్న , ఇల్లులు కట్టుకోవాలన్న భయపడే స్థితికి రేవంత్ సర్కార్ తీసుకొచ్చిందని మండిపడుతున్నారు.

ఈ క్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాసారు. ప్రజలకు ఉపయోగపడే కట్టడాలు నిర్మించాల్సిందీపోయి.. ప్రభుత్వమే కూల్చివేతలు చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న నిర్మాణాలను తొలగించేందుకు.. సరైన ప్రణాళిక లేకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నారని, దీనిపై పేద ప్రజలు చేస్తున్న ఆందోళనలను, వారి మనోవేధనను పరిగణనలోకి తీసుకోకుండా.. కేబినెట్ సమావేశంలో హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం అన్యాయమన్నారు. హైడ్రా ఆధ్వర్యంలో జరుపుతున్న కూల్చివేతలపై పునరాలోచన చేయాలంటూ కోరారు.

సాధారణంగా.. ప్రభుత్వాలేవైనా నిర్మాణాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాయి. చరిత్రలో నిలిచిపోయేలా పేదలకు నిలువ నీడ నిచ్చే ఇండ్లు, రోడ్లు, భవనాలు, బ్యారేజీలు, బ్రిడ్జ్‌లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు కట్టడం, ప్రజలకు ఉపయోగపడే ఇతర నిర్మాణాలపై దృష్టి సారించి ప్రజలకు మేలుచేసేందుకు ప్రయత్నిస్తాయి. కానీ, రేవంత్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా.. కూల్చివేతల ద్వారా పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. 30 ఏళ్ల కింద నిర్మించుకున్న ఇల్లు అక్రమం అని సర్కార్ కూల్చివేస్తే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాత్రికి రాత్రి కట్టుబట్టలతో వాళ్లు రోడ్డున పడితే వారికి దిక్కు ఎవ్వరూ అన్నారు. పేదలతో ఒక సారి చర్చలు జరిపిన తరువాత వారికి ప్రత్యామ్నంగా మరో చోట స్థలం లేదా ఇల్లు చూపించి.. ఆ తరువాత కూల్చివేతలు చేపడితే మంచిందని అభిప్రాయపడ్డారు.

Read Also :  Rajnath Singh : అవినీతిపరుడైన సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించలేరు: రాజ్‌నాథ్‌ సింగ్‌