Budget Session: బీజేపీ టార్గెట్‌గా టీఆర్ఎస్‌ వ్యూహం

రేప‌టి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బీజేపీని టార్గెట్ చేసేందుకు (టీఆర్ఎస్) సిద్ధమైంది.

  • Written By:
  • Updated On - March 7, 2022 / 08:16 AM IST

రేప‌టి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బీజేపీని టార్గెట్ చేసేందుకు (టీఆర్ఎస్) సిద్ధమైంది. గత నవంబర్‌లో జరిగిన హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాల త‌రువాత సీఎం కేసీఆర్ .. బిజెపి, ప్ర‌ధాని మోడీపై యుద్ధం ప్రకటించడంతో ప్రధాన ప్రత్యర్థి ఇప్పుడు బీజేపీ అయ్యింది. దీంతో ఈ సమావేశాల్లో బీజేపీని టీఆర్ఎస్ ఎలా ఎదుర్కోంటుంద‌నేది ఆస‌క్తిగా ఉంది. ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశంలో బీజేపీ పట్ల రాజకీయ వ్యూహమే ప్రధాన ఎజెండాగా టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా బడ్జెట్‌ సమర్పణకు ఒకరోజు ముందు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నప్పటికీ.. సభలో బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించి మంత్రులకు వివరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలిసింది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ని వీడి బీజేపీలో చేరి, గతేడాది జూన్‌లో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేసి ఉప ఎన్న‌క‌ల్లో గెలిచారు. ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది. రాజేందర్‌ను ఓడించాలని హుజూరాబాద్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రచారం చేసిన తర్వాత కూడా టీఆర్‌ఎస్‌ను ఓడించి బీజేపీ అభ్యర్థిగా రాజేందర్ మంచి మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు బీజేపీ సభ్యుడిగా రాజేందర్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టడం టీఆర్ఎస్ అధిష్టానం జీర్ణించుకోలేక‌పోతుంది. దాదాపు 17 ఏళ్లుగా టీఆర్‌ఎస్‌ తరఫున అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన రాజేందర్‌ బీజేపీ ఎమ్మెల్యేగా కొత్త అవతారంలో ముఖ్యమంత్రిపైనా, టీఆర్‌ఎస్‌పైనా విరుచుకుపడాలని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రాజేందర్‌ చేసిన ఆరోపణలను మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎదుర్కోవాలని పార్టీ నాయకత్వం కోరుతోంది. రైతులపై మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ‘లోపాయికార’ విధానాలు, విద్యుత్ సంస్కరణలతో పాటు నిధులు, ప్రాజెక్టుల మంజూరులో తెలంగాణ పట్ల ‘వివక్ష’తో బిజెపిపై దాడికి దిగాలని అధికార పార్టీ యోచిస్తోంది.