తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలిచిన టీవీకే అతిపెద్ద పార్టీగా గెలవడం, ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు విషయంలో డ్రామా, చివరకు విజయ్ సీఎంగా ప్రమాణం చేయడం తెలిసిందే. సీనియర్ నేత అయిన సెంగొట్టయాన్ విజయ్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. సోమవారం తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న సమయంలో ఆయన చొక్కా జేబులో అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత నాయకురాలు జయలలిత ఫొటో కనిపించింది. జయలలిత పట్ల ఆయనకున్న అభిమానానికి ఈ ఫొటో అద్దం పట్టింది. విజయ్ వెంట నడుస్తున్నప్పటికీ ఆయన జేబులో ‘అమ్మ’ ఫొటో పెట్టుకోవడానికి కారణం ఏమిటి? ఆయన అన్నాడీఎంకేలో ఎప్పుడు చేరారు? అన్నాడీఎంకేలో ఉన్న చివరి క్షణం వరకు ఆ పార్టీ గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు రచించారు? జయలలితను ఆరాధించే ఆయన పార్టీని వీడి విజయ్ వెంట ఎందుకు నడవాల్సి వచ్చింది? ఆయన టీవీకే విజయంలో ఎలాంటి పాత్ర పోషించారనేది చూద్దాం.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే గెలవడానికి ప్రధాన కారణం విజయ్ చరిష్మా. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల పాలనతో విసిగిపోయిన తమిళ ప్రజలు విజయ్‌కు పట్టం కట్టారు. అయితే విజయ్ గెలుపు వెనుక ఉన్న చాణక్యుడే సెంగొట్టయాన్. అన్నాడీఎంకే అగ్ర నేతల్లో సెంగొట్టయాన్ ఒకరు. అంతేకాదు జయలలితకు ఆయన నమ్మిన బంటు. పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడంలో ఆయనకు మంచి పేరుంది. అలాంటి నేతను ఎన్నికల ముందు అవమానకర రీతిలో అన్నాడీఎంకే నుంచి బయటకు పంపగా.. విజయ్‌ను గెలిపించి ఆయన ప్రతీకారం తీర్చుకున్నారు.
ఎంజీ రామచంద్రన్‌కు వీరాభిమాని అయిన సెంగొట్టయాన్.. అన్నాడీఎంకే ఆవిర్భావం నుంచి అంటే 1972 నుంచి 2025 వరకు పార్టీలోనే కొనసాగారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆయన పార్టీని వీడాల్సి వచ్చింది. కేఏ సెంగొట్టయాన్ పూర్తి పేరు కుళ్లంపాళ్యం అర్థనారీ సెంగొట్టయాన్. 1948 జనవరి 9న జన్మించిన ఆయన 79 ఏళ్ల వయసులోనూ తన సత్తా ఏంటో తమిళనాడు ఎన్నికల్లో చూపించారు. 1977 నుంచి 2026 వరకు మొత్తం పదకొండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సెంగొట్టయాన్ ఒకే ఒక్కసారి 1996 ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారు. 1977 ఎన్నికల్లో సత్యమంగళం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన సెంగొట్టయాన్.. ఆ తర్వాత గోబిచెట్టిపాళ్యం నియోజకవర్గాన్ని తన కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకున్నారు.
ఎంజీఆర్ హయాంలో అన్నాడీఎంకేలో చేరిన ఎందరో కీలక నేతలు కాలక్రమంలో పార్టీని వీడారు. కానీ సెంగొట్టయాన్ మాత్రం 2025 వరకు పార్టీలోనే కొనసాగారు. మొదట్లో ఎంజీఆర్‌కు, ఆ తర్వాత జయలలితకు ఆయన అండగా నిలబడ్డారు. పార్టీ పరంగా కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన.. వ్యవసాయం, ఐటీ, రెవెన్యూ, అటవీ, విద్య తదితర శాఖలకు మంత్రిగా పని చేశారు. జయలలిత హయాంలో శశికళ పెత్తనం పెరిగిన సమయంలో సెంగొట్టయాన్‌ను కేబినెట్ నుంచి తప్పించారు. పార్టీలోనూ ఆయన పాత్ర నామమాత్రంగా మారింది. ఆ సమయంలో ఇతర కీలక నేతలు పార్టీని వీడినప్పటికీ సెంగొట్టయాన్ మాత్రం అన్నాడీఎంకేను వదల్లేదు. జయలలిత మరణం తర్వాత పళనిస్వామి కేబినెట్లో ఆయనకు అప్రాధాన్య శాఖలను కేటాయించారు. అయినా సరే, సెంగొట్టయాన్ ఏమీ మాట్లాడలేదు.
2026 అసెంబ్లీ ఎన్నికల ముంగిట అన్నాడీఎంకేను బలోపేతం చేయాలని సెంగొట్టయాన్ భావించారు. చీలిక వర్గాలను, బహిష్కరించిన నేతలను వెనక్కి పిలవాలని పళనిస్వామిని కోరారు. అన్నాడీఎంకే నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ఎన్నికల్లో బరిలోకి దిగాలనేది ఆయన వ్యూహం. అయితే ఇది నచ్చని పళనిస్వామి 2025 సెప్టెంబర్ 6న ఆయన్ను పార్టీ పదవుల నుంచి తప్పించారు. వెంటనే ఢిల్లీ వెళ్లిన సెంగొట్టయాన్ సెప్టెంబర్ 10న కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌లను కలిసి అన్నాడీఎంకేలోని చీలిక వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ ఉద్దేశంతోనే తేవార్ జయంతి వేడుకల సందర్భంగా అన్నాడీఎంకే బహిష్కృత నేతలైన పన్నీరుసెల్వం, దినకరన్‌లతో చనువుగా మెలిగారు. దక్షిణ తమిళనాడులోని బలమైన దేవర్ వర్గాన్ని ఏకం చేయడానికి ఆయన ప్రయత్నించారు. కానీ ఇది నచ్చని పార్టీ అధిష్టానం అక్టోబర్ 31న ఆయన్ను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించింది.
పార్టీ ఆవిర్భావం నాటి నుంచి అన్నాడీఎంకేను అంటిపెట్టుకుని ఉన్న తనను ఇలా బహిష్కరించడాన్ని సెంగొట్టయాన్ తట్టుకోలేకపోయారు. నవంబర్ 26న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. విజయ్ సమక్షంలో టీవీకేలో చేరారు. సెంగొట్టయాన్ సామర్థ్యం గురించి తెలిసిన విజయ్.. ఆయనకు పార్టీ హైలెవెల్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ అవకాశాన్ని సెంగొట్టయాన్ రెండు చేతులా ఒడిసిపట్టుకుని, తనేమిటో నిరూపించుకున్నారు.
పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టగల నేర్పు, ఢిల్లీ స్థాయిలో కీలక నేతల పరిచయాలు, పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న సెంగొట్టయాన్ ఇప్పుడు విజయ్‌కు ఊహించని వరంలా మారారు. ఆయన్ను వదులుకున్న అన్నాడీఎంకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోగా.. విజయ్ సీఎం అయ్యారు. సుదీర్ఘ అనుభవం ఉన్న సెంగొట్టయాన్ టీవీకే ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంత జరిగినా సరే ఆయన జేబులో జయలలిత ఫొటో ఉండటం.. ‘అమ్మ’ పట్ల ఆయనకున్న విధేయతను చాటుతోంది. వచ్చే ఎన్నికల నాటికి కూడా సెంగొట్టయాన్ యాక్టివ్‌గా ఉంటే.. అన్నాడీఎంకేలోని జయలలిత అభిమానులను టీవీకే వైపు మళ్లించడంలో ఆయన కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
