TPCC : గాల్లో మేడ‌లు, హామీల‌ కోట‌లు.! రేవంత్ రెడ్డి మ్యాజిక్!

పీసీసీ అధ్య‌క్షునిగా(TPCC) అధికారాలు ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది?

  • Written By:
  • Updated On - March 9, 2023 / 03:34 PM IST

పీసీసీ అధ్య‌క్షునిగా(TPCC) అధికారాలు ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది? పాద‌యాత్ర చేసినంత మాత్రాన సీఎం (Revanth Reddy) కావ‌డానికి అవ‌కాశం ఉందా? అధిష్టానం అనుమతిలేకుండా ఎడాపెడా హామీలు ఇవ్వొచ్చా? బ్యాంకులు రుణాలు క‌ట్టొద్ద‌ని రేవంత్ ఇచ్చిన పిలుపుకు విలువ ఎంత‌? ఇలాంటి అంశాల‌పై కాంగ్రెస్ పార్టీలోనే చ‌ర్చ జ‌రుగుతోంది. తాజాగా రుణాల‌ను చెల్లొచ్చిద్ద‌ని రైతుల‌కు ఇచ్చిన పిలుపు 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా చంద్ర‌బాబు కూడా ఇచ్చారు. ఆ త‌రువాత వాటిని చెల్లించ‌లేక రైతులు ప‌డిన బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం. చ‌క్ర వ‌డ్డీతో స‌హా బ్యాంకులు రాబ‌ట్టిన విష‌యం రేవంత్ కు తెలియ‌ని అంశం కాదు. రుణ మాఫీ ర‌ద్దు హామీతో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు ఆ త‌రువాత కోట‌య్య క‌మిటీని ఏర్పాటు చేసి ఏపీ రైతుల‌కు పూర్తి స్థాయి న్యాయం చేయ‌లేక‌పోయారు. సీన్ క‌ట్ చేస్తే, 2019 ఎన్నిక‌ల్లో ఎలా బోల్తా ప‌డ్డారో చూశాం.

పీసీసీ అధ్య‌క్షునిగా అధికారాలు ఏమిటి(TPCC) 

కేవ‌లం రూ. 500ల‌కు గ్యాస్ సిలెండ‌ర్ ఇస్తామ‌ని హ‌మీ ఇచ్చారు. ఇళ్లు క‌ట్టుకోవ‌డానికి రూ. 5ల‌క్ష‌లు ఉచితంగా ఇస్తామ‌ని రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెబుతున్నారు. రైతులకు రెండు లక్షల రుణ మాఫీని చేస్తామని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయీని కూడా పూర్తిగా చెల్లిస్తామని చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచుతామని రేవంత్ రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చారు. 800 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయీలను కూడా వెంటనే చెల్లిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇలా ప‌లు హామీల‌ను గుప్పిస్తోన్న రేవంత్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా వినిపించిన నినాదాన్ని అందుకున్నారు.

Also Read : Revanth Reddy: రేవంత్ రెడ్డి భద్రతపై ఆదేశాలు జారీ!

`ప్ర‌జ‌లు మోస‌పోయే వ‌ర‌కు రాజ‌కీయ నాయ‌కులు మోసం చేస్తూనే ఉంటారు. ఎవరు ఎంత మోసం చేస్తే అంత‌గా గెలుస్తారు` ఇది ఒకప్పుడు రేవంత్ రెడ్డి అమెరికా వేదిక‌గా చెప్పిన భాష్యం. ఆ సూత్రాన్ని న‌మ్ముకున్న రేవంత్ రెడ్డి వీలున్నంత ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెట్టేలా హామీల‌ను గుప్పిస్తున్నాడ‌ని ఎన్నారైలు గుర్తు చేస్తున్నారు. ఇప్ప‌టికే అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని మ‌రింత అప్పుల్లోకి తీసుకెళ్ల‌డానికి ఇలాంటి హామీ ఇవ్వ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించే వాళ్లు లేక‌పోలేదు. పైగా రేవంత్ రెడ్డి ఇస్తోన్న హామీల‌కు ఎవ‌రు హామీ? అనేది కూడా మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

రాజ‌శేఖ‌ర్ రెడ్డి,  జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌ర‌హాలో

ఒక వైపు రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఇంకో వైపు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌ర‌హాలో రాజ‌కీయాల‌ను న‌డ‌పాల‌ని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడ‌ని ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు భావిస్తున్నారు. ఆనాడు వైఎస్ పాద‌యాత్ర చేసిన రోజుల‌కు ఇప్ప‌టికీ తేడాను గ‌మ‌నించాల‌ని గుర్తు చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వినిపించిన నినాదాన్ని ఏపీ ప్ర‌జ‌లు విన్నారు. ఆయ‌న‌కు అండ‌గా నిలిచారు. ఇప్పుడు ఏపీ ప‌రిస్థితి ఏమిటో అంద‌రూ చూస్తున్నారు. అలాంటి నినాదం అందుకున్న రేవంత్ రెడ్డి(TPCC) సీఎం కావాల‌ని అనుకుంటున్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న మంత్రి ప‌ద‌విని నిర్వ‌హించ‌లేదు. రాజ‌కీయంగా ప‌ట్టుమ‌ని 15ఏళ్ల అనుభ‌వం మాత్ర‌మే ఉంది. సీఎం కేసీఆర్ మాదిరిగా స్పీచ్ ల‌ను ఇవ్వ‌డంలో ఆరితేరారు. అంత‌మాత్రాన కాంగ్రెస్ అధిష్టానం సీఎం ప‌ద‌విని ఆయ‌న‌కు ఇస్తుందా? అనేది చెప్ప‌లేం. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే పీసీసీ అధ్య‌క్షుని హోదాలో (Revanth Reddy)పాల‌న‌లో జోక్యం ఉండ‌దు. అలాంట‌ప్పుడు ఆయ‌న ఇస్తోన్న హామీల‌కు ఎవ‌రు బాధ్య‌త తీసుకుంటారు? అనేది ప్ర‌త్య‌ర్థి పార్టీల ప్ర‌శ్న‌.

 గెలిచిన‌ప్ప‌టికీ ఇత‌ర పార్టీల‌కు వెళ్లిపోతార‌ని

కాంగ్రెస్ పార్టీని(TPCC) తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి లేదు. ఒక వేళ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్ప‌టికీ ఇత‌ర పార్టీల‌కు వెళ్లిపోతార‌ని మెజార్టీ ప్ర‌జ‌ల్లోని అనుమానం. గ‌త అనుభ‌వాల‌ను గ‌మ‌నిస్తే గెలిచిన త‌రువాత బీజేపీ లేదా బీఆర్ఎస్ పార్టీలోకి క్యూ క‌డ‌తార‌ని ఎవ‌రైనా చెబుతారు. అలాంట‌ప్పుడు రేవంత్ రెడ్డి చేసేది కూడా ఏమీ ఉండ‌దు. చ‌ట్టం ప్ర‌కారం కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ వేదిక‌గా టీఆర్ఎస్ విలీనం చేసుకుంది. రాజ్యాంగంలోని వెసుల‌బాటును రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాత్ర‌మే కాదు ఎవ‌రూ కాద‌న‌లేరు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో నైతిక‌త ఉన్న లీడ‌ర్లు కాంగ్రెస్ పార్టీలో ఎంద‌రు ఉన్నారు? అనేది ప్ర‌శ్నించుకోవాలి. ఒక వేళ వాళ్ల‌ను గెలిపించిన‌ప్ప‌టికీ ఇత‌ర పార్టీల‌కు వెళ్ల‌కుండా ఉండే సూత్రం రేవంత్ రెడ్డి ద‌గ్గర ఉందా? అంటే చెప్పలేం. ఎందుకంటే, ఆయ‌నకు బీ ఫారాలు ఇచ్చే అధికారం లేదు. నేరుగా ఏఐసీపీ మాత్ర‌మే టిక్కెట్ల‌ను ఖ‌రారు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో న‌డిపిన వైఎస్ కూడా ఆనాడు ఏఐసీసీని కాద‌ని ఏమీ చేయ‌లేక‌పోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయ‌గ‌ల‌రా? అంటే వ‌చ్చే స‌మాధానం అంద‌రికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి వినిపించే హామీల‌కు బాధ్యులు ఎవ‌రు? అందుకే, లెక్క‌లేన‌న్ని హామీల‌ను ఇస్తూ వెళుతున్నారని బీఆర్ఎస్, బీజేపీ విమ‌ర్శించ‌డంలో అర్థంలేక‌పోలేదు.

Also Read : Revanth Reddy: రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు భారీ ప్రమాదం.. పలు కార్లు ధ్వంసం!