Tiger Attack : కొమురంభీం జిల్లాలో అడవులకు అత్యంత సమీపంలో ఉండే పలు ఏజెన్సీ ఏరియాల్లో పెద్దపులి హల్‌చల్ చేస్తోంది. దీంతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని భయంభయంగా రోజులు నెట్టుకొస్తున్నారు. ఇదే జిల్లాలోని కాగజ్ నగర్ మండలం గన్నారంలో ఓ మహిళ పంట చేనులో పత్తి ఏరుతుండగా పెద్దపులి దాడి చేసిన ఘటనను మరువకముందే.. ఇవాళ పట్టపగలు పొలంలో పనిచేస్తున్న రైతు సురేష్‌పై పులి దాడి చేసింది. ఈ ఘటనలో సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. దాడి చేసిన పులి జాడను(Tiger Attack) గుర్తించే పనిలో అటవీ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
Also Read :Electricity Charges Hike : షాకింగ్.. రేపటి నుంచి ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపు
అంతకుముందు గన్నారంలో మహిళపై పులి దాడి చేసిన ఘటన వివరాల్లోకి వెళితే.. ఆమె పొలంలో పత్తి ఏరుతుండగా పులి ఎటాక్ చేసింది. సమీపంలోని మరో పొలంలో ఉన్న కూలీలు ఈ దాడిని చూసి షాకయ్యారు. వెంటనే వారు అరుపులు కేకలు పెట్టారు. దీంతో పులి అక్కడి నుండి పారిపోయింది. పులి దాడిలో గాయపడిన మహిళను స్థానికులు కాగజ్ నగర్ లోని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే పులి దాడిలో తీవ్ర గాయాలు కావడంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. చనిపోయిన మహిళను గన్నారం గ్రామానికి చెందిన మోర్ల లక్ష్మీగా గుర్తించారు. మోర్లే లక్ష్మీ మృతదేహంతో ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కాగజ్ నగర్‌లో ఉన్న అటవీ శాఖ అధికారి ఆఫీసును ముట్టడించారు. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపించారు.మోర్లే లక్ష్మీ కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో దిగివచ్చిన అటవీ శాఖ అధికారులు మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల చెక్కును అందించారు. బాధిత కుటుంబీకులు చేసిన మిగతా డిమాండ్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని అటవీ అధికారులు హామీ ఇచ్చారు.