Site icon HashtagU Telugu

Secunderabad : సికింద్రాబాద్‌ – షాలీమార్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం.. పట్టాలు తప్పిన బోగీలు

Secunderabad To Shalimar Express Train Derailed Nalpur Station West Bengal

Secunderabad :  సికింద్రాబాద్‌ నుంచి షాలీమార్‌ మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ (22850) రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. పశ్చిమబెంగాల్‌లోని నల్పూర్‌ స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  రెండు ప్రయాణికుల బోగీలు, ఒక పార్సిల్‌ వ్యాన్‌ పట్టాలు తప్పాయని సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే డివిజన్‌కు చెందిన చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (సీపీఆర్‌వో) వెల్లడించారు. ఇవాళ తెల్లవారుజామున 5.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.  కోల్‌కతా నగరం నుంచి 40 కి.మీ దూరంలో రైలులోని బోగీలు పట్టాలు తప్పాయి. మధ్యనున్న రైల్వే ట్రాక్ నుంచి ఎడమ వైపున్న రైల్వే ట్రాక్‌లోకి రైలును మళ్లిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మధ్యనున్న రైల్వే ట్రాక్, ఎడమ వైపునున్న రైల్వే ట్రాక్‌‌లను అనుసంధానించే ట్రాక్ విభాగంలో లోపం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ప్రమాద కారణాలపై ఇంకా  అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. సికింద్రాబాద్‌(Secunderabad) నుంచి షాలీమార్‌ మధ్య ఈ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకసారి నడుస్తుంటుంది.

Also Read :KL Rahul : తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్.. ప్రగ్నెంట్ అయిన హీరోయిన్..

బెంగాల్‌లోని సంత్రాగాచి, ఖరగ్ పూర్‌ల నుంచి సంఘటనా స్థలానికి వెంటనే యాక్సిడెంట్ రిలీఫ్ అండ్ మెడికల్ ట్రైన్లను పంపారు. అవి సంఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే.. ఆ ట్రైన్లలోని వైద్య నిపుణులు, ఇతర సిబ్బంది కలిసి సహాయక కార్యక్రమాలను మొదలుపెడతారు.  రైలు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తారు. పట్టాలు తప్పిన రైలు బోగీలను ట్రాక్‌పైకి తిరిగి ఎక్కించే పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అక్కడికి పెద్దఎత్తున రైల్వే కార్మికులు చేరుకున్నారు. రైల్వే  ఉన్నతాధికారులు దగ్గరుండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.