Site icon HashtagU Telugu

Congress : ఎమ్మెల్సీ పోల్స్‌లో కాంగ్రెస్ పరాభవానికి ముఖ్య కారణాలివే..

Congress Telangana Mlc Polls Results Bjp Won

Congress : తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయినా రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ  స్థానాలకు ఎన్నికలు జరిగితే, రెండింటిని బీజేపీయే కైవసం చేసుకుంది. అధికార కాంగ్రెస్ ఆధిపత్యాన్ని చాటుకోలేకపోయింది. కరీంనగర్‌-నిజామాబాద్‌-మెదక్‌-ఆదిలాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి గెలిచారు. ఉమ్మడి కరీంనగర్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-మెదక్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ మద్దతుతో మల్క కొమరయ్య గెలిచారు. ఉమ్మడి నల్గొండ-వరంగల్‌-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్‌టీయూ టీఎస్‌ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి గెలిచారు. ఎందుకిలా జరిగింది ? అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. ఈ పరాజయానికి దారితీసిన ముఖ్య కారణాలను ఈ కథనంలో చూద్దాం..

Also Read :Lokesh : పవన్ అన్న జోలికి వస్తే వదిలిపెట్టం – జగన్ కు లోకేష్ వార్నింగ్

వ్యక్తిగత ఆధిపత్యం..

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ పార్టీకి ఇన్‌ఛార్జ్‌లు మారారు. కానీ పార్టీలో ఎలాంటి మార్పు రాలేదు.  బీఆర్ఎస్ బలాన్ని క్షేత్రస్థాయిలో లాగేసుకొని, బీజేపీ బలోపేతం అవుతోంది. కాంగ్రెస్‌లో మాత్రం నేతల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోంది. వ్యక్తిగత ఆధిపత్యం కోసం తప్ప.. పార్టీకి ఆధిపత్యం తెచ్చేందుకు కసరత్తు చేసే నేతలు కనిపించడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీ పరాజయానికి ఇదే ప్రధాన కారణమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

చివరి నిమిషంలో అభ్యర్థులు

ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలోనూ  కాంగ్రెస్(Congress) పార్టీ చాలా జాప్యం చేసింది. తొలుత ఎవరి పేర్లయితే వినిపించాయో.. వాళ్లకు మొండిచెయ్యి  మిగిల్చారు. చివరి క్షణంలో పార్టీ అభ్యర్థులు మారిపోయారు. దీంతో వారికి పార్టీ క్యాడర్ నుంచి తగిన సహకారం లభించలేదు. ఈ అభ్యర్థులు అప్పటికప్పుడు గ్రౌండ్ వర్క్ చేయలేక చతికిల పడ్డారు. పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి మూడు సభల్లో పాల్గొన్నా కాంగ్రెస్ అభ్యర్థులకు కలిసి రాలేదు.

పదవులపైనే ధ్యాస

ఎమ్మెల్సీ పోల్స్ జరిగిన ఉమ్మడి జిల్లాల నుంచి పలువురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారంతా కలిసి పనిచేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఈ చేదు అనుభవం మిగిలి ఉండేది కాదు. మంత్రి పదవుల కోసం కొందరు, నామినేటెడ్ పోస్టుల కోసం మరికొందరు, పార్టీ పదవుల కోసం ఇంకొందరు ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆయా జిల్లాల కీలక నేతలు సీరియస్‌గా ఫోకస్ పెట్టిన దాఖలాలు కనిపించలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా వారు క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలాలు సైతం తక్కువే ఉన్నాయని చెబుతున్నారు.

బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం

ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన స్థానాల్లో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు బీజేపీకి పరోక్షంగా పలువురు బీఆర్ఎస్ స్థానిక నేతలు సహకారాన్ని అందించారని అంటున్నారు. ఈవిషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పక్కా ప్లాన్‌తో ముందుకుసాగాయి. కానీ ఈ వ్యూహాన్ని ఛేదించే స్కెచ్‌ను కాంగ్రెస్ గీయలేకపోయింది.

గ్యారంటీల అమలు

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 ప్రధానమైన గ్యారంటీలను ప్రజలకు ఇచ్చింది. వాటిలో కొన్నింటిని ఇంకా అమలు చేయాల్సి ఉంది. మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థికసాయం ఇవ్వడం వంటి స్కీంలను అమలు చేయాల్సి ఉంది. వృద్ధాప్య పింఛన్లను పెంచుతామన్నారు.. ఇంకా పెంచలేదు. గ్రాడ్యుయేట్లు, టీచర్లకు ఇలాంటి అంశాలపై మంచి అవగాహన ఉంటుంది. గ్యారంటీలను అమలు చేయకపోవడాన్ని వాళ్లు వ్యతిరేకించారు. అదే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కనిపించింది.

Also Read :Prabhas : హాస్పటల్ లో ప్రభాస్.. నిజమేనా ?