Weather Report : సుర్రు షురూ..పెరిగిన ఉక్కపోత.. 35 డిగ్రీలు దాటిన టెంపరేచర్

Weather Report : మే నెల రాకముందే ఎండ సెగ మొదలైంది.

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 08:06 AM IST

Weather Report : మే నెల రాకముందే ఎండ సెగ మొదలైంది. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా నాలుగైదు డిగ్రీలు పెరిగిపోయాయి. మనం ఫిబ్రవరి మొదటివారంలో ఉండగానే గరిష్ట ఉష్ణోగ్రతలు  35 డిగ్రీలను దాటేశాయి. మంగళవారం రోజు హైదరాబాద్‌లోని మోండా మార్కెట్‌లో  36.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సరూర్‌నగర్‌లో 36.3, బాలానగర్‌ 35.9, బేగంపేటలో 35.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాప్రా, చార్మినార్, రాజేంద్ర‌న‌గ‌ర్, మెహిదీప‌ట్నం, జూబ్లీహిల్స్, ఖైర‌తాబాద్‌‌లలో కూడా 35 డిగ్రీల సెల్సియ‌స్‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదయ్యాయి.ఇక రాత్రివేళ నమోదయ్యే టెంపరేచర్స్ కూడా పెరిగాయి. రెండురోజుల క్రితం వరకు రాత్రివేళ టెంపరేచర్ 16 నుంచి 17 డిగ్రీల వరకు ఉండగా.. ఇప్పుడది 21.2 డిగ్రీలకు పెరిగిందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి ఎండలు ఎక్కువే ఉంటాయనేందుకు ఇవన్నీ సిగ్నల్స్ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  రాబోయే రెండు రోజుల పాటు కూడా ఉష్ణోగ్ర‌త‌లు(Weather Report) పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.  ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్నారు. రాత్రి స‌మ‌యాల్లో ప‌లు ప్రాంతాల ప్ర‌జ‌లు ఉక్క‌పోత‌కు గుర‌వుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఏసీలు, కూలర్లు రంగంలోకి..

ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇక ఇళ్లలో పగలూరాత్రి ఫ్యాన్ల వాడకం మొదలైంది. ఏసీలు, కూలర్లు కూడా వాడటం మొదలుపెట్టారు. హైదరాబాద్‌లో పగటిపూట 3,100 మెగావాట్ల విద్యుత్ వినియోగం, రాత్రి పూట 2,697 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. గత ఏడాది ఇదే ఫిబ్రవరి నెలలో హైదరాబాద్‌లో రాత్రివేళ  సగటు విద్యుత్  వినియోగం  కేవలం 2,287 మెగావాట్లే నమోదైంది. దీన్నిబట్టి ఈసారి చాలా త్వరగా  ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం మొదలైందని అర్థం చేసుకోవచ్చు.

Also Read : CM Jagan – Vujicic : సీఎం జగన్‌పై నిక్ వుజిసిక్ ప్రశంసలు.. ఎవరీ వుజిసిక్ ?

రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. 

  • తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.6 డిగ్రీలుగా నమోదైంది. 75 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
  • రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగానే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో కూడా వాతావరణ పొడిగా ఉండనుంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే  అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.