సైబరాబాద్ పరిధిలో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో భాగంగా మదీనగూడలోని గిస్మత్ జైల్ మండీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా లేబుల్స్ లేకుండా ముడి పదార్థాలు, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. చికెన్, మటన్, చేపలను సరైన విధంగా నిల్వ చేయకపోవడంతో వాటిని వెంటనే తొలగించినట్లు అధికారులు తెలిపారు. అలాగే రెస్టారెంట్ వద్ద చెల్లుబాటు అయ్యే FSSAI లైసెన్స్ కూడా లేకపోవడం గుర్తించారు.
పెస్ట్ కంట్రోల్ రికార్డులు, నీటి నాణ్యత పరీక్షలు, ఫుడ్ హ్యాండ్లర్ల వైద్య రికార్డులు అందుబాటులో లేకపోవడం, పాత్రలు కడిగే ప్రాంతం అపరిశుభ్రంగా ఉండటం, నీరు-ఆహార వ్యర్థాలు నిల్వ ఉండటం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. వంటశాలలో పనిచేస్తున్న సిబ్బంది అప్రాన్లు, గ్లౌజులు లేకుండా పనిచేయడం, పాత ఇనుప కత్తులు, దెబ్బతిన్న చాపింగ్ బోర్డులు ఉపయోగించడం, కిచెన్, స్టోరేజ్ ప్రాంతాల్లో తగినంత వెలుతురు లేకపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పాటు, అపరిశుభ్రమైన ఆహార పదార్థాలను అక్కడికక్కడే తొలగించారు. పరిశుభ్రత ప్రమాణాల్లో ఆ సంస్థకు కేవలం 43 శాతం హైజీన్ స్కోర్ మాత్రమే వచ్చినట్లు వెల్లడించారు. 50 శాతం కంటే తక్కువ స్కోర్ రావడంతో కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
