కొన్ని చిన్న చిన్న విషయాలు ఇళ్లల్లో పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. ఇలాంటి గొడవలు చివరికి హత్యలు, ఆత్మహత్యల వరకు వెళ్లిన సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. భార్యాభర్తలు, తల్లీకుమార్తెలు, తండ్రి కొడుకుల మధ్య చిన్నగా మొదలైన మాటలు కాస్తా.. చివరికి ఎవరో ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంట్లో నాటుకోడి కూర వండాలనే విషయంలో జరిగిన ఘర్షణ చివరికి తండ్రిని కుమారుడు చంపే వరకు వెళ్లింది. తండ్రి కోడి కూర వండాలని తల్లికి చెప్పగా.. ఆమె రేపు వండుదామని చెప్పడంతో గొడవ జరగగా.. వారి కుమారుడు తండ్రిని కొట్టి చంపడం తీవ్ర కలకలం రేపుతోంది.
జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జంగిలి రమేష్ (42) అనే వ్యక్తి.. మంగళవారం రోజున రాత్రి 10 గంటల సమయంలో నాటు కోడి కూర వండాలని తన భార్య అనూషకు చెప్పాడు. తాను నాటు కోడిని తీసుకునివచ్చి కోస్తానని.. కూర వండాలని అడిగాడు. అయితే అదే రోజు అనూష చేపలు తీసుకువచ్చి కూర వండింది. దీంతో ఇవాళ చేపలు వండాను కాబట్టి.. నాటుకోడిని తర్వాతి రోజు ఉదయం వండుతానని చెప్పింది. కానీ అందుకు రమేష్ వినలేదు. అయినా అతడికి సర్ది చెప్పేందుకు అనూష విశ్వ ప్రయత్నాలు చేసింది.
అయితే తాను చెప్పిన మాట భార్య వినలేదని రమేష్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో తన భార్య అనూషను రమేష్ ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టాడు. అది చూసిన వారి కుమారుడు గణేష్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. తల్లిని ఎందుకు తిడుతున్నావంటూ తండ్రిని నిలదీశాడు. దీంతో రమేష్ మరింత ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే గణేష్‌ను కూడా రమేష్ తిట్టడం ప్రారంభించాడు. ఆపేందుకు ప్రయత్నించగా.. రమేష్ మరింత రెచ్చిపోవడంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు.
ఈ క్రమంలోనే తన తండ్రి తిట్టే మాటలకు తీవ్ర ఆగ్రహానికి గురైన గణేష్.. పక్కనే ఉన్న రోకలి బండను తీసుకుని తండ్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే రక్తపు మడుగులో పడిపోయాడు. ఈ నేపథ్యంలోనే తీవ్రంగా గాయపడిన రమేష్‌ను స్థానికులు జనగామ ఆస్పత్రికి తరలించారు. అయితే అతడిని పరిశీలించిన డాక్టర్లు.. రమేష్‌ను వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలోనే రమేష్‌ను వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రోజున మృతి చెందాడు. రమేష్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు.
